పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటున్న వైయస్ జగన్ – 1

2014 లో వైస్సార్సీపీ తృటిలో అధికారం కోల్పోయింది. సునాయాసంగా గెలవాల్సిన ఎన్నికలు…. అయినా ఓడింది. విశ్లేషకులు, వైస్సార్సీపీ పార్టీ ప్రజలు అందరూ కలిసి తీర్మానించింది ఏంటంటే చంద్రబాబు 600 హామీలు, మోడీతో పొత్తు జనసేన మద్దతు కలిసి వైస్సార్సీపీని ఓడించాయని. కానీ అసలు నిజం అందరికంటే ఈ ఓటమితో ఎక్కువ నష్టపోయిన  జగన్ కి బాగా తెలుసు.

హామీలు అందరూ ఇస్తారు. జగన్ కూడా సుమారుగా హామీలిచ్చారు. జగన్ ఇచ్చిన ఒక్క అమ్మ ఒడి పథకం పిల్లలని స్కూలుకి పంపే ప్రతి కుటుంబానికి 5 ఏళ్ళ కాలంలో 60 వేలు తెచ్చిపెట్టేది. ఇటువంటి హామీలు ఇంకా వున్నా వైస్సార్సీపీ ఓడిపోయింది. కారణం అభ్యర్థులు…వారి అనుభవలేమి..వారి ఆర్థికపరిస్థితి… అతివిశ్వాసంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు.

2011 లో జగన్ వైస్సార్సీపీ పెట్టినప్పుడు తనకు అండగా నిలబడ్డ చాలా మందికి వై స్ జగన్ 2014 అవకాశం కల్పించారు. రాజకీయాలకు కొత్త అయినా ఆర్ధికంగా ప్రత్యర్థిని ఎదుర్కోలేరని తెలిసిన వైస్సార్సీపీ బీఫారం ఇచ్చింది. దీనికి రెండు రకాల కారణాలు. ఒకటి మొదటి నుండి పార్టీ కోసం వున్నారు, అవకాశం కల్పించాలి అనే ఆలోచన రెండు అభ్యర్థులు ఎవరైనా  జగన్ ఇమేజ్ వాళ్ళని గెలిపిస్తుంది అని పార్టీ అధిష్టానం నమ్మకం అంటే జగన్ నమ్మకం.

సమస్య ఇక్కడే వచ్చింది. అభ్యర్థులు కూడా అలాగే ఆలోచించారు. జగన్ ఇమేజ్ గెలిపిస్తుంది అని ఎలక్షన్ మానేజ్మెంట్ బేసిక్స్ మరిచి ఊహల్లో వున్నారు. ఈ అలసత్వం, అతివిశ్వాసం వైఎస్సార్సీపీ ఓటమికి కారణం అయ్యింది. ప్రతిపక్షానికి పరిమితమై మరో ఐదు సంవత్సరాలు ఎదురుచూడవలసిన పరిస్థితి. ఇంకోసారి ఇదే పునరావృత్తమైతే పార్టీ మనుగడే కష్టం అనుకుంటున్నవేళలో జగన్ పోగుట్టుకున్న చోటే వెతుకుంటున్నాడు.

ఈ మధ్య కాలంలో  చాల నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని, ఇంచార్జిలను మారుస్తున్నారు. జగన్ పార్టీ స్థాపించిన వెంటనే మద్దతు తెలిపిన అతి కొద్దిమందిలో జంగా  కృష్ణమూర్తి ఒకరు. క్లీన్ ఇమేజ్ వున్నా జంగా 2014 గురుజాలనుండి ఓడిపోయారు. కారణం యరపతినేని ఆర్ధికవనరులు ముందు సరితూగలేకపోయారు. అందుకే పల్నాడు ప్రాంతంలో రాజకీయంగా భలమైన కుటుంబం నుండి కాసు మహేష్ మహేష్ రెడ్డి ని ఇంచార్జిగా నియమించారు.

అదే కోవలో వై యస్ కుటుంభం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన   పిల్లి సుభాష్ చంద్రబోస్, గన్నవరం ఇంచార్జి, వైయస్ కి అత్యంత సన్నిహితుడు దుట్టా రామచంద్ర రావు స్థానాల్లో ఆర్ధికంగా బలమైన అభర్ధులను ఇంచార్జిలుగా నియమించారు.

ప్రస్తుతం మంత్రిగా  వున్న దేవినేని ఉమామహేశ్వర రావు కి సరైన పోటీ ఇవ్వాలని జోగి రమేష్ ని తప్పించి ఆర్ధికంగా స్థితిమంతుడే కాకుండా రాజకీయాల్లో చాలాకాలం నుండి వుంటున్న వసంత నాగేశ్వర్ రావు కుమారుడైన వసంత కృష్ణప్రసాద్ కి అవకాశం ఇస్తున్నారు.

రెండురోజులు క్రితం చిలకలూరిపేట ఇంచార్జిగా మర్రి రాజశేఖరని తప్పించి విడుదల రజనిని నియమించారు. వైయస్ హవాలో కూడా గెలిచిన అతికొద్దిమందిలో ప్రత్తిపాటి పుల్ల రావు ఒకరు. ఆర్ధికంగా పుల్ల రావు ని ఎదుర్కొవాలంటే అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో బాగా సంపాదిస్తున్న విడుదల రజని లాంటి వారి అవసరాన్ని గుర్తించింది కాబోలు.

మర్రి రాజశేఖర్ అలకపూనారు అని వినిపిస్తుంది. పైన పేర్కొన్న ఇంచార్జి మార్పులన్నీ ముందున్న ఇంచార్జిలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కాబట్టి అంతా  సవ్యంగా నడిచింది. జిల్లా అధ్యక్షుడు కూడా అయినా రాజశేఖర్ తో చర్చించలేదని తెలుస్తుంది. మరి ఈ మార్పు ఎలాంటి చిచ్చు రేపుతుందో చూడాలి .

రాబోయేకాలంలో ఇలాంటివి మరిన్ని  జరగనున్నాయి. అటువంటి వాటిలో జగన్ సొంత జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా వున్నా రఘురామి రెడ్డిని కౌన్సిల్ కి పంపి వై యస్ స్నేహితుడు మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి కి అవకాశం కల్పిస్తారట.

కడప జిల్లాలోనే మరో ముఖ్యమైన నియోజకవర్గం జమ్మలమడుగు. ఇక్కడనుండి వైసీపీలో గెలిచిన అది నారాయణ రెడ్డి టీడీపీ పంచన చేరి మంత్రయ్యారు. ప్రస్తుతానికి యువకుడైన  సుధీర్ రెడ్డి ఇంచార్జిగా వున్నా ఇక్కడ చివరి నిముషంలో మార్పు జరిగే అవకాశం వుంది.

నెల్లూరు జిల్లా కావాలి, వెంకటగిరి ఒంగోలు జిల్లాలో అద్దంకి పర్చూరుకి కొత్త అభ్యర్థుల వేట జరుగుతుంది అని తెలుస్తుంది. ఇక్కడ వున్న ఎమ్మెల్యే ఇంచార్జి అభ్యర్ధులకు మార్పులు చేర్పులు జరుగుతాయి అని లీకులు ఇస్తున్నారు.

సశేషం

పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటున్న వైయస్ జగన్ – 2