AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలి… వైసీపీ అధికార ప్రతినిధి డిమాండ్!

AP: వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ అరెస్టు చేయాలి అంటూ వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ని ఎందుకు అరెస్టు చేయాలి అనే విషయానికి వస్తే ఇటీవల ఈయన రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని సందడి చేశారు.

డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే గత ప్రభుత్వం గురించి కూడా ఈయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. యువకులు బైక్ సైలెన్సర్లను తీసి స్టంట్ లు చేయాలి అని కూడా చెప్పారు.

ఇలా చేయటం వల్లే ఈ కార్యక్రమానికి వెళ్లి వస్తున్నటువంటి ఇద్దరు యువకులు మరణించారు. వారి మరణానికి పరోక్షంగా కారణమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అరెస్టు చేయాలి అంటూ ఈయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకపోయినా తన అరెస్టు చేయాలంటూ డిమాండ్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పలువురు ఈ వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల తెలంగాణలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ప్రమేయం లేకుండానే ఒక అభిమాని మరణించడంతో అందుకు అల్లు అర్జున్ పరోక్షంగా కారణమని భావించి అక్కడ ప్రభుత్వం ఆయనని అరెస్టు చేసి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే వెంకట్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ ని కూడా అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.