టిడిపి, వైసిపి రెండు ఒకే జాతి పక్షులు: తులసి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి, కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకుంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసిపి నేతలు పెద్ద ఎత్తున్న విమర్శలే గుప్పిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ , టిడిపిల పొత్తుపై కాంగ్రెస్ నేత తులసీరెడ్డి స్సందించారు. కాంగ్రెస్ టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టిడిపి, వైసిపి రెండు కూడా మోసపూరిత పార్టీలని తులసిరెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఎన్నికలు అయ్యాక బిజెపి గూటికి చేరుతాయని, టిడిపి తెలుగు ద్రోహుల పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడిపి, వైసిపి రెండు ఒకే జాతి పక్షులని ఆయన ఎద్దేవా చేశారు. కొంత కాలంగా కాంగ్రెస, టిడిపి పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పార్టీలన్ని ఎన్నికల వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అన్ని పార్టీలకు దాదాపు ఒక వేదిక సిద్దమైనట్టు చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్, వామపక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే ప్రకటించారు. బిజెపి వైసిపి కలిసి వెళ్తాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో వైసిపి జగన్.. బిజెపితోనే కలిసి నడుస్తాడన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు హాట్ అయ్యాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో బిజెపితో కలిసి వైసిపి నడిచే ప్రసక్తే లేదని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఒంటరిగా ఉన్నటువంటి కాంగ్రస్, టిడిపి కలిసి పోటి చేయాలనే ఆలోచన చేసినట్టు నేతలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ కూడా కలిసి పోవాలనే నిర్ణయించినట్టుగా కూడా తెలిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్దితిలో టిడిపితో కలిస్తే కనీసం 20-25 స్థానాలనైనా గెలిచే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ భావిస్తుందట.

ఒకరేమో పార్టీలు కలుస్తాయని, మరొకరేమో ఎట్టి పరిస్థితిలో కలిసే ప్రసక్తే లేదని తెలపడంతో పార్టీల తీరు అయోమయ పరిస్థితిలో పడింది. టిడిపి, కాంగ్రెస్ కలుస్తాయో లేదో కానీ కార్యకర్తలు మాత్రం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అందరి అయోమయాలను తుడిచేస్తూ కాంగ్రెస్, టిడిపి ఏం చేస్తాయో చూడాలి.