తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తామని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మంగళవారం సెలవు రోజుగా ప్రకటించారు.
మధ్యాహ్నం 1 గంటల వరకు కౌంటింగ్ ఫలితాలు తెలిసే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు 20 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 13, మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటిగా ఉన్నాయి.
కౌంటింగ్ కేంద్రానికి మొబైల్ అనుమతి లేదు. లెక్కింపు పూర్తయే వరకు కౌంటింగ్ ఏజెంట్లు బయటకు వెళ్లేందుకు అనుమతించరు. శేరిలింగంపల్లిలో అత్యధిక రౌండ్లలో, బెల్లంపల్లిలో అత్యల్ప రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి పెన్ను తప్ప ఏవీ తీసుకెళ్లకూడదు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 2379 రౌండ్స్‌లో లెక్కింపు పూర్తవుతుంది. లెక్కింపును 1916 మంది మైక్రో అబ్జర్వర్లతో పర్యవేక్షించడం జరుగుతుందని రజత్ కుమార్ చెప్పారు. పాస్ లు జారీ చేసిన ప్రకారం కౌంటింగ్ కేంద్రంలోకి మీడియాను అనుమతించడం జరుగుతుందని తెలిపారు.