(వి. శంకరయ్య)
అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.
రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న దాత సుఖీభవ’ అంటూ కొత్త పథకమొకటి తెరమీదకు తెచ్చి ఎన్నికల కోడ్ రాక ముందే రైతులకు చెక్కులు ఇచ్చి మాయ జేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధ మౌతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాదయాత్ర సందర్భంలో గాని 2014 ఎన్నికల్లో గాని ప్రధానంగా రైతు రుణ మాఫీ పథకానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రకటన చేశారు. ఇంకా చెప్పాలంటే వైసిపి నేత జగన్ ఈ హామీ ఇవ్వనందుననే ఓడి పోయారని అందరూ భావించారు. ఈ హామీ అమలు చేయ లేనందుననే తను వాగ్దానం చేయ లేదని తప్పుడు హామీ ఇచ్చి వుంటే ముఖ్యమంత్రి అయ్యే వాడినని జగన్ చెప్పడమే కాకుండా మీడియా తో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనాకు వచ్చిన అంశం అందరికీ తెలిసిందే. .
ఇంత వివరణ ఎందుకు ఇవ్వాలసి వస్తున్నదంటే అంతటి ప్రాముఖ్యత గలిగి చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టిన రైతు రుణమాఫీ పథకం అయిదు ఏళ్లు గడుస్తున్నా పూర్తి గా అమలు జరగ లేదు. వాస్తవంలో మొత్తం రుణాలు మాఫీ చేస్తామని మాటలు చెప్పిన ముఖ్యమంత్రి తుదకు ఒకటిన్నర లక్షల రూపాయలు మాత్రం మాఫి చేశారు. అదికూడ ఇంకా రెండు కంతులు అంద లేదు.
ఇందులోనూ మరో మతలబు వుంది. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం 45 శాతం మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. పైగా ఒకటిన్నర ఎకరా గల చిన్న రైతులలో 15 శాతం మందికే బ్యాంకు రుణాలు అందు తున్నాయి. మిగిలిన రైతులు అందరూ ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే 50 శాతం మంది మాత్రమే పాక్షికంగా రుణ మాఫీ అందింది. ప్రైవేటు రంగంలో అప్పులు తీసుకున్న అత్యధిక సంఖ్యాక రైతులు ఈ పథకం కిందకు రాలేదు.
మొత్తం 24 వేల కోట్లు రుణాలు మాఫీకి ప్రభుత్వం సిద్ధమైతే ఇంకా రెండు కంతులు 9 వేల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించ వలసి వుంది. ఇది కాకుండా రుణ మాఫీకి అర్హత వున్నా మాఫీ జరగలేదని తిరిగే రైతులు వేలలో వున్నారు. ఈ సంఖ్య ఇంకా తేలవలసి వుంది.
ఒక సంవత్సరం కాలంగా మిగిలిన కంతులు బ్యాంకులో జమ చేస్తామని చెబుతున్నారు. తుదకుఎన్నికల తర్వాతనే జమ చేస్తారని ఒక పక్క చెబుతూ తిరిగి ప్రతి రైతుకు ప్రస్తుతం 10 వేలు చొప్పున చెక్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధ మౌతున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపు కొని 5 ఎకరాల లోపు వుండే రైతులకు 15 వేల రూపాయలు ఆ పైబడి వుండే రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే 10 వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వ నున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికల లోపు కేంద్రం తను ఇచ్చే ఆరు వేలు మూడు విడతలుగా ఇస్తామని చెబుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తంతో కలిపి ఇస్తున్నందున తను ఇవ్వదలచిన మొత్తం ఏ విధంగా ఇస్తుందో వివరణ ఇవ్వలేదు.
ఏం జరిగినా ప్రస్తుతం ఒక కంతు చెక్కు మాత్రమే ఇస్తారు. అయితే ఇక్కడ రెండు ట్విస్ట్ లు వున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ రైతు రుణ మాఫీ పథకం అయిదు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి పూర్తి చేయ లేదు. దాన్ని పెండింగ్ పెట్టి ఎన్నికల గండం గడిచేందుకు తగుదు నమ్మా అంటూ అది కూడా నగదు కాకుండా చెక్కులు ఇస్తే రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు నమ్మే స్థితిలో లేరు.మొదటి రుణ మాఫీ పధకమే అర్థాంతరంగా వుంటే రెండవ పథకం ఫలితం గాలిలో దీపం లాంటిదే.
పైగా మరో ప్రమాదం పొంచి ఉంది. ఎపిలో 60.73లక్షల హెక్టార్లు సాగు జరుతూ వుంటే కౌలు రైతులు 20.53లక్షల హెక్టార్లలో సాగు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా ఎపిలో కౌలు పద్దతి ఎక్కువ. ఎపిలో పరిస్థితి భిన్నంగా వుంది. కౌలు విధానంలో కూడా అనధికారికంగా ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. ఎట్టి రికార్డులు లేవు. వీరిలో చాల మందికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వలేదు. మరి కేంద్రం గాని రాష్ట్రంగాని ఇచ్చే నిధులు వాస్తవ సాగు దారులకు ఏవిధంగా ఇస్తారో ఇంత వరకు తేల్చలేదు.
రైతు రుణ మాఫీ పథకంలో కూడా మెజారిటీ శాతం రైతులకు మాఫి జరగలేదు. వీరంతా ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొంది నందున పథకానికి దూరంగా ఉన్నారు. ఎక్కువ మోతుబరి రైతులు పాక్షికంగానైనా లాభం పొందారు. ఇప్పుడు కూడా మొత్తం సాగులో33. 8శాతం వుండే కౌలు రైతులకు ఆర్థిక సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు.
(వి. శంకరయ్య సీనియర్ జర్నలిస్టు ఫోన్ 9848394013)