పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి గొడవ జరిగేందుకు కారణమైన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను టిపిసిసి సస్పెండ్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ కోరుట్లకు ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కాన్వాయి పై దాడి జరిగింది. ఈ దాడికి కారణం రాములే నని మధుయాష్కీ టిపిసిసి క్రమశిక్షణ కమిటికి ఫిర్యాదు చేశారు.
దీని పై జనవరి 18 న షోకాజ్ నోటిసులు ఇచ్చి వారంలోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటి చైర్మన్ కోదండరెడ్డి ఆదేశించారు. దాని పై ఇప్పటి వరకు రాములు వివరణ ఇవ్వలేదు. దీంతో రాములును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటి ఏకగ్రీవ తీర్మానం చేసింది. కొమిరెడ్డి రాములు కోరుట్లకు ఎమ్మెల్యేగా పని చేశారు.
కొమిరెడ్డి రాములు సస్పెన్షన్ పార్టీలో చర్చనీయాంశమైంది. గతంలో కూడా అనేక మంది నేతలు ఏకంగా పార్టీ పెద్దలనే తిట్టినా వారి పై చర్యలు లేవు కానీ తన పై చర్యలేందుకుని రాములు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ పూరిత విధానాలు నడుస్తున్నాయని విమర్శించారు. మధుయాష్కీ గౌడ్ అన్ని తప్పుడు ప్రచారాలు చేశారని, అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి తనను సస్పెండ్ చేశారన్నారు.