TG: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం పట్ల కళాకారులు, సంగీత దర్శకులు సినీ రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశారు అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ మరో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇలా తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే కొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి తీరును ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ గేయ రచయిత సాహితీవేత్త సుద్దాల అశోక్ తేజ తెలంగాణ తల్లి విగ్రహం గురించి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ తల్లి విగ్రహంలో నాకు ముగ్గురమ్మల మూలపూటమ్మనో.. పెద్దమ్మనో.. దేవతనో కనిపించలేదని..నన్ను కన్న నా తల్లి జానకమ్మ కనిపించిందన్నారు. మా అమ్మనే కాదు..నా తోబుట్టువులు కనిపించారని., సాధారణ మధ్యతరగతి దిగువ కుటుంబాల ఒక రైతు వనిత కనిపించిందని..తెలంగాణ నేలమ్మ కనిపించిందని కితాబిచ్చారు. ఇలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకువచ్చిన తెలంగాణ సర్కారుకు శిరసా ప్రమాణాలను చేశారు.
ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి పిల్లల పాఠ్య పుస్తకాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఫోటోతో పాటు, జయజయహే తెలంగాణ అధికారిక పాఠ్యపుస్తకాలలో చేర్చాలని తెలిపారు. ఇలా తెలంగాణ విగ్రహాన్ని మార్చటానికి కొందరు స్వాగతిస్తూ ఉండగా మరికొందరు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు.