KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ తో పాటు డైరెక్టర్ వెంకట్రావ్ లతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కెసిఆర్ గారిని కలిశారు. ఇలా మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలవడమే కాకుండా ఈ నెల 9వ తేదీ తెలంగాణలో ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందజేశారు.
ఈనెల తొమ్మిదవ తేదీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరగబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అదేవిధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించినట్లు పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కూడా మర్యాదపూర్వకంగా తాము కలిసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని కోరినట్టు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పక్షాన అందరినీ మర్యాదగా గౌరవించుకుంటామని, తెలంగాణ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. అలాగే కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ అంశాలపై మాట్లాడలేదని, ఆయన అసెంబ్లీకి వస్తారా? రారా? అనేది వారి వ్యక్తిగత విషయం అని, అటువంటి చర్చలేమి జరగలేదని అన్నారు. తెలంగాణ విగ్రహం విషయంలో వ్యతిరేకించడం ప్రతిపక్ష నాయకులు అది వారి హక్కు. ఇప్పుడు జరిగిన బేటీ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే జరిగిందని తనని ఈ విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం కోసమే భేటీ అయినట్లు తెలిపారు.