Revanth Reddy: మొదటిసారి ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేసిన సీఎం రేవంత్!

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో యువ వికాసం పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రూప్ 4 విజయం సాధించిన అభ్యర్థులకు స్వయంగా రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ప్రతిపక్ష పార్టీ గురించి విమర్శలు చేయడమే కాకుండా మొదటిసారి ఎమ్మెల్సీ కవిత గురించి కూడా మాట్లాడారు.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఓడిపోయిన వాళ్లకు పదవులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీగా ఓడిపోయిన వినోద్‌కు కేబినెట్ పదవి ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.ఎంపీగా పోటీ చేసే ఓడిపోయిన కవితకు మూడు నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటూ కూడా ఈయన విమర్శించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగాలు చేసి ఈ తెలంగాణను సంపాదించారని తెలిపారు.

గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ తెలంగాణకు చేసింది శూన్యం అని ఈయన గుర్తు చేశారు.మంచి పాలన అందిస్తున్న తమపై కొత్త బిచ్చగాడి మాదిరిగా శాపనార్ధాలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా అని ప్రశ్నించారు. ప్రతిదానికీ కొంత సమయం పడుతుంది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు 10 నెలలు ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారని విమర్శించారు. .