చంద్రబాబు శ్వేతపత్రాలు ఎవరి కోసం ?

(PK)

నాలుగున్నరేళ్ల పాలనపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు ఎవరిని టార్గెట్‌ చేసుకుని వాటిని సంధిస్తున్నారు? దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రం చేయనంతటి అభివృద్ధి చేశానని, రాష్ట్ర విభజన చట్టం అమలులో ఎదురైన ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ పత్రాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నవ నిర్మాణ దీక్షలు, మహా సంకల్ప సభలు, జన్మభూమి, ధర్మ పోరాట సభలేకాకుండా అధికారులు, పార్టీ సమావేశాల్లోనూ ప్రతి నిత్యం ఈ విషయాలను చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పలు బహిరంగ సభల్లోనూ రాష్ట్ర విభజనకు ముందు తర్వాత పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరిస్తూనే ఉన్నారు. అయినా ఇప్పుడు వాటన్నింటినీ క్రోడీకరించి మళ్లీ ఎందుకు ప్రజల ముంగిట పెడుతున్నారు? నిజంగా ప్రజల కోసమే ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

కాస్త లోతుగా ఆలోచిస్తే ప్రజల కోసం కొత్తగా ఈ విషయాలన్నింటినీ చెప్పాల్సిన అవసరం ప్రస్తుతం చంద్రబాబుకు కనిపించడంలేదు. మరి ఎవరి కోసం, ఎందుకు శ్వేతపత్రాలతో అరిగిపోయిన పాత రికార్డులనే మళ్లీ వినిపిస్తున్నారు. దీనికి రెండు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి జనవరి ఆరో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మోడీతో కటీఫ్‌ చేసుకున్న చంద్రబాబు అదేపనిగా ఆయన విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లు ఆయనతో కలిసి అధికారాన్ని పంచుకుని అనూహ్యంగా విడిపోయి బద్ధశత్రుత్వం తెచ్చుకున్నారు. రాజకీయ కారణాలు ఏమైనా ఉండవచ్చు కానీ మోడీపై కాంగ్రెస్‌ కంటె ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నది ప్రస్తుతం దేశంలో చంద్రబాబే. బాబు ఇంత చేస్తున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు తప్ప జాతీయ నాయకత్వం ఇప్పటివరకూ ధీటుగా సమాధానం ఇవ్వలేదు. అప్పుడప్పుడూ చిన్నచిన్న కౌంటర్లు ఇచ్చినా చంద్రబాబు చేసే హంగామాతో పోల్చితే అవి లెక్కలో లేనట్లే. ఈ నేపథ్యంలో మోడీ ఏపీలో జరిగే సభలో బాబు బండారం మొత్తాన్ని బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారట. చంద్రబాబు చేసే ఆరోపణలకు వివరణ ఇచ్చి ఆయనపై రాజకీయంగా విమర్శలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని స్థాయిలో మోడీ బాబుపై ఎదురుదాడి చేస్తే అది జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. బాబు రోజూ తిట్టినా వాటన్నింటికీ కలిపి మోడీ ఒక్కసారి కౌంటర్‌ ఇస్తే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మోడీ కంటె ముందే శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కేంద్రం సహాయం చేయలేదని, నమ్మకద్రోహం చేసిందనే ప్రచారాన్ని హోరెత్తించారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా తన పరిస్థితి మారడంతో దాన్నుంచి పార్టీని, క్యాడర్‌ను బయటపడవేసేందుకు, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఎడాపెడా ఇచ్చేస్తున్న వాగ్దానాలకు ఈ శ్వేతపత్రాలు ఉపయోగపడతాయని బాబు భావిస్తున్నారు.