ఎన్టీఆర్ జీవితాన్ని మలుపు తిప్పిన కేవీ రెడ్డి నిర్ణయం?

కాలం మారుతోంది. మనుషులూ మారుతున్నారు. మనుషుల మనస్తత్వాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనిషికీ మనిషికీ  మధ్య బంధాలు ఆవిరై పోతున్నాయి. మానవ సంబంధాల  స్థానంలో ఆర్ధిక సంబంధాలు  వచ్చేశాయి. ఆత్మీయతలు, అనుబంధాలు, అభిమానాలు మరుగున పడిపోతున్నాయి. మనుషుల మధ్య  కులాలు, మతాలు, ప్రాంతాలు అడ్డుగోడలుగా నిలిచాయి. సమాజ హితం కన్నా స్వంత ప్రయోజనాలే మిన్న అనుకుంటున్న దశలో వున్నాము.  ఇవ్వాళ  మనం స్పీడ్  ప్రపంచంలో వున్నాం. అయితే ఒకప్పుడు మనుషుల మధ్య  అనుబంధాలు, ఆప్యాతలు ఎలావుండేవో, సాటి మనిషిని మనిషిగా గుర్తించి ఎలా సహాయం  చేసేవారో తెలుసుకుంటే … ఈ తరానికి ఆశర్య మనిపిస్తుంది. కానీ ఇది నిజం … 61 సంవత్సరాల క్రితం నిజంగా  జరిగింది.

 

మద్రాసులో ఒకప్పుడు వున్న విజయా  వాహిని  స్టూడియోస్ గురించివినే  వుంటారు. 1945లో ప్రారంభమైన స్టూడియో నిర్మాణం 1948లో పూర్తి  అయ్యింది. స్టూడియో  అధినేత బి. నాగిరెడ్డి. ఇక్కడ నిర్మాణమైన తొలి  సినిమా గుణ సుందరి కథ. నాగిరెడ్డికి సన్నిహితులైన కదిరి వెంకట రెడ్డి గుణ సుందరి కథ  చిత్రానికి దర్శకుడు. ఈయనే ప్రఖ్యాత దర్శకుడు కెవి. రెడ్డి.

విజయా వాహిని స్టూడియోస్ ఆసియాలోనే అతి పెద్ద ఫిలిం స్టూడియో. తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ సినిమాలతో పాటు హిందీ చిత్రాల నిర్మాణం కూడా జరిగేది.

1949లో  ఎల్వీ  ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన “మనదేశం” చిత్రంతో నందమూరి తారక  రామారావు సినిమా రంగానికి పరిచయమయ్యాడు. తొలి సినిమాలో కానిస్టేబుల్  పాత్రలో నటించిన రామారావు  నిర్మాత దర్శకులను బాగా ఆకర్షించాడు. అందుకే  వరుసగా  షావుకారు, పల్లెటూరి పిల్ల, సంసారం, పాతాళ  భైరవి, మల్లేశ్వరి, పెళ్లిచేసి చూడు, దాసీ మొదలైన సినిమాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. రామారావు కెవి రెడ్డి దృష్టిలో పడ్డాడు, నాగిరెడ్డికి రామారావు గురించి చెప్పాడు. నాగిరెడ్డి రామారావును విజయ సంస్థలో పనిచేయడానికి  నెల జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అక్కడ  నుంచి  ఎన్టీఆర్, కేవీ రెడ్డి ల మధ్య ఆత్మీయ అను బంధం  మొదలైంది. రామారావు  విజయ నుంచి బయటకు వచ్చి  పిచ్చి పుల్లయ్య, చండీరాణి, చంద్రహాసన్, వద్దంటే డబ్బు, తోడు దొంగలు, రేచుక్క, రాజు పేద, అగ్గిరాముడు, పరివర్తన, మిస్సమ్మ, జయసింహ, కన్యాశుల్కం, తెనాలి రామకృష్ణ, చింతామణి, జయం మనదే, సొంత వూరు, చిరంజీవులు, పెంకి పెళ్ళాం, చరణ  దాసీ  చిత్రాలు చేసి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

అదే సమయంలో విజయ్ ప్రొడక్షన్స్ ఒక పౌరాణిక సినిమా తీయాలనుకున్నారు.  పింగళి నాగేంద్ర రావు కథను కూడా రెడీ చేశాడు. అది నాగిరెడ్డిపై, చక్రపాణి తో పాటు కేవీ  రెడ్డికి కూడా బాగా నచ్చింది. ఇక ఆ చిత్రంలో పాత్రలకు నటి నటుల ఎంపిక మొదలైంది. అందులో ప్రధానమైన పాత్ర కృష్ణుడు . ఈ పాత్రకు నాగిరెడ్డి, చక్రపాణి వేరే నటుణ్ని తీసుకుందామని అనుకున్నారు. ఇదే విషయం కేవీ రెడ్డికి చెప్పారు. అయితే అప్పటికే ఆ పాత్ర ధరించడాన్ని ఆయన మనసులో ఓ నటుడున్నాడు. ఆ పేరు కేవీ రెడ్డి వారితో చెప్పాడు. శ్రీకృషుడు పాత్ర చాలా ప్రధాన మైనది. కథ మొత్తం ఆ పాత్ర చుట్టూ ఉంటుంది. అలాంటి పాత్రకు అతను న్యాయం చెయ్యలేడు. వద్దు, మేము చెప్పిన నటుడిని తీసుకోండి అన్నారు. కానీ కేవీ రెడ్డి వారిద్దరితో ఏకీభవించలేదు. “దర్శకుడుగా నాకు అతనే కరెక్ట్ అనిపిస్తుంది ” అని చెప్పాడు.

 

నాగిరెడ్డి, చక్రపాణి “అతన్ని పెడితే సినిమా విజయవంత కాదు” అని తెచ్చి చెప్పారు. అప్పుడు కేవీ రెడ్డి ” నాకు అతనిపై వంద శాతం  నమ్మకం వుంది, అతనైతేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది ” అని చెప్పాడు. కెవి రెడ్డి అంటే వారిద్దరికీ అమితమైన గౌరవం. అందుకే “మీ ఇష్టం ” అన్నారు . కెవి రెడ్డి వెంటనే ఆ నటుడుని పిలిపించి జరిగిన సంగతి అంతా చెప్పి, భారతం, భగవద్గీత చదవమని చెప్పాడు” అతను “సరే గురువు గారు” అన్నాడు.” నా నమ్మకాన్ని వమ్ముచేయ వద్దు” అన్నాడు కేవీ. “మీ మాట, పరువు నిలబెడతా గురువు గారు” అని ఆ యువ నటుడు ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించాడు. ఆ చిత్రమే “మాయా బజార్ “

అతనే నందమూరి తారక రామారావు. ఈ సినిమాలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, ఎస్వీ  రంగ రావు, గుమ్మడి, ముక్కామల, సి ఎస్ ఆర్,రుషేంద్ర మని, సంధ్య, నాగభూషణం, మిక్కిలినేని, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం,రేలంగి, అల్లు రామలింగయ్య  మొదలైన వారు నటించారు. ఈ సినిమా 27 మార్చి 1957లో విడుదలైంది. ఆ సినిమాలో కృష్ణ పాత్రలో రామ రావు జీవించాడు.

అలా కేవీ రెడ్డి,  రామారావును కృష్ణ పాత్రకు ఎంపిక చేసి తన పంతం నెగ్గించుకున్నారు. ఆ పాత్రే రామారావు పౌరాణిక పాత్రలకు శ్రీకారం చుట్టింది .ఆ తరువాత రామారావు  17 సార్లు కృష్ణ పాత్ర ధరించాడు. ఆంధ్రులకు పౌరాణిక పాత్రల ద్వారా ఆరాధ్య  నటుడయ్యారు. అలా కెవి రెడ్డి ఎన్టీఆర్ మీద వున్న అపారమైన అభిమానం, ఆత్మీయ  భావన వెల కట్టలేనివి. మనిషికీ మనిషికీ మధ్య వుండాల్చిన బంధం… మానవ సంబంధమే అని నిరూపించారు కేవీ రెడ్డి.

-భగీరథ