KCR: ఏ క్షణమైన ఉప ఎన్నికలు జరగవచ్చు… సిద్ధంగా ఉండండి… కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KCR: బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అధ్యక్షులతో శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈనెల 27న వరంగల్‌లో చేపట్టనున్న భారీ బహిరంగ సభ ఏర్పాటు, జన సమీకరణ వంటి అంశాలపై ఆయన నేతలకు దిశా నిర్దేశాలు చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై ప్రజలందరూ కూడా విసిగిపోయారని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన మాటలను నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారని ఆ విషయాన్ని ప్రజలందరూ ఇప్పుడు గుర్తిస్తున్నారని కెసిఆర్ తెలిపారు.

ఇలా కాంగ్రెస్ మోసపూరితపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఇలాంటి తరుణంలో ఏ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మన పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా ఏ క్షణమైనా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు రావచ్చని అందుకు పార్టీ పరంగా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని నాయకులకు సూచనలు చేశారు.

కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ విధ్వంసానికి పాల్పడుతోందని, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.దేశంలో బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభావం తగ్గిపోయి.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలకు ఇబ్బందులు తప్పవు. ఇలాంటి సమయంలోనే మనం చాలా అప్రమత్తంగా ఉంటూ తరచూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు చేరువలో ఉండాలని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణవ్యాప్తంగా పండుగలా జరపాలని, ప్రతి గ్రామం, వార్డు పరిధిలో పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. వరంగల్‌ సభకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చేలా దృష్టిసారించాలన్నారు. సభకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం ఖాయమని, సభకు తరలి వచ్చే కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి అంటూ మాజీ మంత్రులు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.