Mithun Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైకాపా నాయకులు చిక్కులలో పడటమే కాకుండా వరుసగా అరెస్టులు అవుతూ జైలుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు జైలులో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే త్వరలోనే మరో నేత జైలుకు వెళ్లడానికి కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందని తెలుస్తోంది.
వైసిపి ఎంపీగా కొనసాగుతున్నటువంటి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోని ఏపీ సిఐడి పోలీసులు ఢిల్లీ బయలుదేరారు.ఏపీలో మద్యం కేసుకు సంబంధించి ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మద్యంపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపించాయి.
ఇలా మద్యం అక్రమాలపై కూటమి సర్కార్ గతేడాది సెప్టెంబర్ లో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలు, తయారీ అవకతవకల్లో ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం ఉందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇటీవల మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇలా తనపై కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ఈయన పిటిషన్ దాఖలు చేయడంతో కచ్చితంగా మద్యంలో అవినీతి జరిగిందని స్పష్టమవుతుంది.
ఇక కోర్ట్ ఈయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ తన పిటీషన్ కొట్టి వేయడంతో మిథున్ రెడ్డికి ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. విచారణ సమయంలో మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని ఏపీ సీఐడీ హైకోర్టుకు తెలిపింది. మిథున్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని చెప్పింది. దీంతో ముందస్తు బెయిల్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఇలా కోర్ట్ ఈ పిటిషన్ కొట్టివేయటంతో ఏపీ సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఈయనని అరెస్టు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఇక మిధున్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు కాకపోవడంతో ఈయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.