Salaar Movie Review : ‘సలార్’ మూవీ ఎలా ఉందంటే…?

(చిత్రం: సలార్, విడుదల తేదీ : 22 డిసెంబర్-2023, రేటింగ్ : 3.5/5, నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, సప్తగిరి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయారెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్, టిను ఆనంద్ తదితరులు. రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్, నిర్మాత: విజయ్ కిరంగదూర్, సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, సంగీతం: రవి బస్రూర్, బ్యానర్: హోంబలే ఫిలింస్)

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ కోసం అభిమానులేకాదు.. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.. అలాంటి ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య నేడు (22 డిసెంబర్-2023) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ అభిమానులను ఎంతమేరకు మెప్పించింది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకుందా.. లేదా? తెలుసుకుందాం…

కథేంటో చూద్దాం : అసోంలోని ఓ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు దేవా అలియాస్ సలార్ (ప్రభాస్). ఆ ప్రాంతానికి ఆధ్య (శృతిహాసన్)అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువస్తారు . దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అక్కడినుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారి బారి నుంచి ఆమెను కాపాడుతాడు దేవా. ఈ నేపథ్యంలో తన స్నేహితుడైన దేవాను వెతుక్కొంటూ చాలాకాలం తర్వాత ఆ ప్రాంతానికి వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వస్తాడు. తన తల్లి (ఈశ్వరీరావు)తో కలిసి అసోంలో దేవా ఎందుకు ఉన్నాడు? కారణం ఏమిటి? ఆ ప్రాంతానికి ఆధ్యను ఎందుకు తీసుకొస్తారు? భారత్ సరిహద్దులోని ఖాన్సార్ ఆటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది… ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది. ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాను వెతుక్కొంటూ వరదరాజ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్ (జగపతిబాబు) తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్లాడు? యుద్ద విరమణ ఓటింగ్ సమయంలో దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు? ఓటింగ్‌లో ఎవరు గెలిచారు? శౌర్యంగ పర్వానికి దేవాకు ఉన్న లింకు ఏమిటి? దేవాకు సలార్ అని పేరు ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ ‘సలార్’ సినిమా కథ.

విశ్లేషణ : ‘సలార్’ సినిమా ప్రారంభమే ఎంతో ఆసక్తిగా మొదలవుతుంది. ప్రారంభ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఒక విధమైన హుషారుని రేకెత్తిస్తాయి. దేవా, వరదరాజ మన్నార్ బాల్యంతో మంచి పవర్‌ఫుల్ ఎపిసోడ్‌తో సినిమా మొదలవడం.. ఆ తర్వాత అసోంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడం..అలాగే ఆధ్య కిడ్నాప్ వ్యవహారం చకచకా జరిగిపోతాయి. ప్రథమార్ధంలో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిభకు అద్దం పట్టింది. ఫస్టాఫ్ చివర్లో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలయి సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆద్యంతం ఆసక్తి కలిగిస్తుంది. ఇక ద్వితీయార్ధంలో ఖాన్సార్ ఆటవీ ప్రాంతం దేశంగా మారడం.. దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంత మంది సామంత దొరలను నియమించడంతో కథనం ఆసక్తిగా మారుతుంది. అయితే ఓ పని మీద రాజమన్నార్ దేశాన్ని వదలిపోవడంతో సామంతుల కుట్రలు మొదలవుతాయి. ఖాన్సార్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజ మన్నార్‌తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్‌కు వెళ్తుంది. సెకండాఫ్‌లో కాటేరమ్మ ఎపిసోడ్‌లో విష్ణును, ఆయన తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్ లు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. అలాగే సెకండాఫ్‌లో ప్రభాస్ నట విశ్వరూపం వెండితెరపై చూడాల్సిందే. ప్రతీ సన్నివేశంలోనూ ఇరగదీశాడు. తన నటన ద్వారా అభిమానులను అలరించి ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి అద్బుతమైన స్క్రిప్టుతో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో ‘సలార్’ని తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ కట్టిపడేసింది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను మలిచిన విధానం భేషుగ్గా ఉంది.

ఇక ఈ చిత్రానికి ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘కేజీఎఫ్‌’ను మించిన స్థాయిలో ‘సలార్‌’ను తెరకెక్కించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ‘సలార్’లో ఏముంది? అని చూస్తే… ‘హీరోయిజం.. హీరో ఎలివేషన్లు.. అంతేగా’ అని క్లుప్తంగా, ఆలోచించకుండా చెప్పవచ్చు. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి… ప్రభాస్ కటౌట్ & పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ లోటు చేయలేదు. ఫ్యాన్స్ విజిల్స్ వేసే మాస్ మూమెంట్స్ ఫుల్లుగా ఇచ్చారు. అయితే.. కథ ..కథనం విషయంలో కొంత డిజప్పాయింట్ చేశారు. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్స్ మధ్యలో కథ చిన్నబోయింది. ‘సలార్’ సెకండాఫ్ చూస్తుంటే… ‘కెజియఫ్’కు, ఈ సినిమాకు మధ్య చాలా అంటే చాలా పోలికలు కనపడతాయి. క్యారెక్టర్లు కొత్తవి అయినా… కథ, కథనాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇండియా వచ్చిన అమ్మాయి చివరకు సురక్షితంగా ఉంటుంది. ఆ లెక్కన చూస్తే… కథ ప్రారంభం, ముగింపు సరిపోయాయి. కానీ, మధ్యలో చూపించిన రక్తపాతం, హింసకు అసలైన ముగింపు ఇవ్వలేదు. రెండో పార్టు కోసం దాచి పెట్టారు. ముఖ్యంగా హీరో చేసే యుద్ధం అతని కోసం కాదు, స్నేహితుడి కోసం. అది ఎంత మందికి నచ్చుతుందనేది చూడాలి. బయట ప్రపంచాన్ని లోపలికి రానివ్వకుండా శత్రు దుర్బేధ్యమైన కోటను ఓ తండ్రి నిర్మించడం, ఆ తండ్రి స్థానం మీద కన్న కొడుకులతో పాటు శత్రువులు కన్ను వేయడం, తమ వంతు ప్రయత్నాలు చేయడం, బయట నుంచి లోపలకు వచ్చిన ఒకడు అందరినీ చిత్తు చేయడం వంటివి ‘కెజియఫ్ 1’ను తలపించాయి. అయితే… క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను ‘కెజియఫ్’ నుంచి వేరు చేసింది. లేదంటే సేమ్ టు సేమ్ అన్నట్లు ఉండేది. ‘సలార్’ ఫస్టాఫ్ విషయంలో కంప్లైంట్స్ లేకున్నా… ఆ ఎలివేషన్స్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. కొడుకు కోసం తల్లి ఎందుకు అలా ప్రవరిస్తుంది? అనేది తర్వాత తెలుస్తుందని సరిపెట్టుకుంటాం. ఇంటర్వెల్ తర్వాత మరోసారి యాక్షన్ హైలైట్ అవుతుంది కానీ కథ కాదు. ఎమోషన్స్ సైతం కనెక్ట్ అయ్యేలా ప్రశాంత్ నీల్ తెరకెక్కించలేదు. నిడివి తగ్గిస్తే బావుంటుందనే ఆలోచన వస్తుంది. ‘కెజియఫ్’ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది… కథ, కథనం కంటే హీరోయిజం. హీరోకు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు. మాస్ జనాలకు అవి విపరీతంగా నచ్చాయి. వందల కోట్ల వసూళ్ళకు కారణం కూడా ఆ హీరోయిజమే. అయితే… ‘కెజియఫ్’లో అంతర్లీనంగా చక్కటి కథ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ ఉంటుంది. ‘సలార్’కు వస్తే… ఆ హీరోయిజం మిస్ కాలేదు.

ఎవరెలా చేశారంటే… దేవాగా ప్రభాస్ మరోసారి తన గత చిత్రాల్లోని పాత్రలను మించిన యాటిట్యూడ్‌ను, ఫైర్‌ను ప్రదర్శించాడు. ఫస్టాఫ్‌లో అండర్ డాగ్‌గా కనిపించిన ఆ పాత్ర.. సెకండాఫ్‌కు వచ్చే సరికి ఊహకు అందని విధంగా ఉంటుంది. అలాగే ప్రభాస్ చెలరేగిపోయి చేసే రెండు యాక్షన్ సీన్లు సినిమాను బ్లాక్‌బాస్టర్‌గా మార్చాయి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. ‘సలార్’లో రెబల్ స్టార్ ప్రభాస్ ను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తుంది. ఆ కటౌట్‌కు సరిపడా, అటువంటి కంటెంట్ పడి చాలా రోజులైందని గుర్తొస్తుంది. హీరోయిజం, ఆ హీరో ఎలివేషన్స్ ప్రభాస్ కటౌట్ ఉండటంతో వర్కవుట్ అయ్యాయి. ఆయన ఇమేజ్ వల్ల నమ్మేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సులలో ప్రభాస్ అవలీలగా చేసేశారు. ఆ ఫైట్స్ చేయడానికి పెద్దగా కష్టపడినట్లు అనిపించలేదు. ప్రభాస్ లుక్స్ బావున్నాయి. ప్రభాస్ తర్వాత ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్ హైలైట్ అవుతారు. వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ తన నటనతో అదరగొట్టాడు. తమ నటనతో వాళ్ళిద్దరూ ఆకట్టుకుంటారు. కన్న బిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదన, ప్రేమను ఈశ్వరీ రావు చక్కగా చూపించారు. శృతి హాసన్ పాత్ర పరిమితమే. కానీ, ఉన్నంతలో హుందాగా కనిపించారు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టినూ ఆనంద్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నీకల్ గా చూస్తే.. ప్రధానంగా చెప్పుకోవలసింది భువన్ గౌడ సినిమాటోగ్రఫీ గురించి. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు. ‘కేజీఎఫ్’ మాదిరిగానే కలర్ టోన్‌తో సీన్లను మరింత ఎమోషనల్‌గా భువన్‌ గౌడ చూపించాడు. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. అలాగే రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా అతడు అందించిన బీజీఎం సెకండాఫ్‌లో సినిమాను చింపేసిందనే చెప్పాలి. సినిమా నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా ఉన్నాయి. హోంబలే బ్యానర్‌ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మాణ విలువలు కనిపించాయి. రాజ్యంలో అంతర్గత రాజకీయాలు, స్నేహం, అధికార దాహం లాంటి అంశాలతో రూపొందించిన మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ ‘సలార్’ సినిమాని చెప్పుకోవచ్చు.

రేటింగ్ : 3.5/5