Balakrishna Birthday: నందమూరి బాలకృష్ణ పేరు వినగానే అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగిపోడం కామన్. ప్రతి పుట్టిన రోజు రోజునా ఆయన నుంచి అభిమానులకు ఓ సూపర్ గిఫ్ట్ ఉండటం ఆనవాయితీగా మారిపోయింది. ఈసారి కూడా అదే రీత్యా జూన్ 10న బాలయ్య అభిమానులకు రెండు స్పెషల్ ట్రీట్స్ సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అఖండ 2’ చిత్రం నుంచి టీజర్ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే టీజర్ కోసం ప్రత్యేక విజువల్స్‌ను ప్లాన్ చేసి తీస్తున్నాడట. ఈ టీజర్‌ను పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా రూపొందించేందుకు బోయపాటి భారీ స్కేలు మీద ప్లాన్ చేస్తున్నాడట.
‘అఖండ’కి వచ్చిన స్థాయి రెస్పాన్స్‌ను మించేలా సీక్వెల్‌ను తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్న ఆయన, ఈసారి బాలయ్య మాస్ అవతారాన్ని మరో లెవెల్‌లో చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తవగా, మూడో షెడ్యూల్‌లో టీజర్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను ఫినిష్ చేస్తారట.
ఇక మరోవైపు బాలయ్య కొత్త సినిమా గురించి కూడా బర్త్‌డే రోజునే అధికారికంగా ప్రకటన రానుందని సమాచారం. గతంలో ‘వీరసింహారెడ్డి’తో హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని మళ్లీ బాలయ్యతో జట్టు కట్టబోతున్నాడు. ఇటీవల సన్నీ డియోల్‌కు ‘జాట్’ అనే బ్లాక్‌బస్టర్ ఇచ్చిన గోపీ, ఈ ఊపులోనే బాలయ్యను మరోసారి మాస్ మూడ్‌లో ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించనుండగా, మరో పెద్ద నిర్మాణ సంస్థ భాగస్వామ్యంగా రానుందని టాక్.