డైలాగ్ కామెడీ ఓకే! ‘నువ్వు తోపురా’ (మూవీ రివ్యూ)

నువ్వు తోపురా

దర్శకత్వం : హరినాథ్ బాబు 
తారాగణం :  సుధాకర్ కొమకుల, నిత్యా  శెట్టి, నిరోషా, రవివర్మ తదితరులు 
రచన : అజ్జూ మహాకాళి,  సంగీతం : సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రహణం : వెంకట్ దిలీప్ 
బ్యానర్ : యునైటడ్ ఫిలింస్, స్‌.జె.కె.ప్రొడక్ష‌న్స్ (యు.ఎస్‌.ఎ)
నిర్మాతలు : శ్రీకాంత్ డి,  జేమ్స్ వాట్ కొమ్ము 
విడుదల : మే 3, 2019
2.25 / 5

***

 2012 లో శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లో తెలంగాణా పాత్ర వేసి పేరు తెచ్చుఇకున్న సుధాకర్ కోమాకుల తిరిగి తెలంగాణా పాత్ర నటిస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు హరినాథ్  దీనికి దర్శకత్వం వహించాడు. హైదరాబాదీ సినిమాగా దీనికి ప్రచారం జరిగింది. ట్రైలర్స్ కూడా క్రేజ్ పెంచాయి. ఇప్పుడిది ఎలా వుందో ఒకసారి చూద్దాం…

కథ 

సరూర్ నగర్ సూరి (సుధాకర్) అనే హైదరాబాద్ స్టూడెంట్ బీటెక్ తప్పి ఆవారాగా తిరుగుతూంటాడు. దురుసుగా ప్రవర్తిస్తాడు.  ఉద్యోగం చేసి ఇల్లు గడిపే తల్లి (నిరోషా), చదువుకుంటున్న చెల్లెలు వుంటారు. ఈ క్రమంలో రమ్య (నిత్యా శెట్టి) అనే అమ్మాయి వెంటపడి ప్రేమిస్తాడు. ఆమె బీటెక్ పాసయి ఎమ్మెస్ కి అమెరికా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యా  తేడా లొచ్చి విడిపోతారు. సూరి చిన్నప్పట్నుంచీ డప్పు కళాకారుడు. అతడి టాలెంట్ చూసి అమెరికా  తెలంగాణా అకాడెమీ అక్కడ కార్యక్రమానికి పిలిపించుకుంటుంది. అక్కడికి చేరుకున్నసూరి తన దురుసుతనంతో వాళ్ళకి దూరమై  తిరిగి రాలేక ఇరుక్కుంటాడు. ఒక  పెట్రోలు బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుని, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా తలదాచుకుని బ్రతుకుతూంటాడు. అప్పుడు జాన్, అజర్, సలీం అనే డ్రగ్ డీలర్లు పరిచయమై అతడికి అండగా వుంటారు. ఇక ఇక్కడే సెటిలవ్వాలంటే ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు సంపాదించుకోవాలని తెలుసుకుని, ఇసాబెల్లా అనే అమ్మాయితో పెళ్లి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆమె ఏడువేల డాలర్లు డిమాండ్ చేస్తుంది. అంత డబ్బులేక డ్రగ్ డీలింగ్ మీద కన్నేస్తాడు. డీలర్లు ముగ్గురూ రంజాన్ పండగనాడు పెద్ద మొత్తంలో డ్రగ్ దందా చేస్తున్నారని తెలుసుకుంటాడు. ఇక ఏడువేల డాలర్లు సంపాదించు కోవడానికి దీన్నే టార్గెట్ చేస్తాడు. అప్పుడేం జరిగింది? ఆ డబ్బు సంపాదించుకుని గ్రీన్ కార్డు కోసం ఇసాబెల్లాని పెళ్లి చేసుకున్నాడా? అమెరికాకే వచ్చిన రమ్య ఏమైంది? సరూర్ నగర్లో తల్లీ చెల్లెలు ఏమయ్యారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ 

నిర్మాతల్లో ఒకరు అన్నట్టు ఇది సామాన్యుడి బయోపిక్. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి? అందుకే ఇదిలా తయారయ్యింది. బయోపిక్స్ ని నిజవ్యక్తుల జీవిత కథగా తీస్తారు, కల్పిత పాత్ర జీవిత కథగా కాదు. నిజవ్యక్తుల జీవిత చరిత్రలు తీసినప్పుడు అవి సినిమాటిక్ గా  వుండవు. ఇలాగే కల్పిత పాత్రతో కూడా బయోపిక్ తీయవచ్చను కోవడం పొరపాటు. కల్పిత పాత్రతో సినిమాటిక్ విలువలు వుండాల్సిందే. అందుకని ఈ సామాన్యుడి బయోపిక్ కమర్షియల్ విలువలకి దూరం జరిగి, కథగా నిలబడడానికి నానా అగచాట్లూ పడింది. ఒక ఆవారా కల్పిత ఫార్ములా పాత్ర బయోపిక్ ఎవరిక్కావాలి, అలాటి కుర్రాడు నిజంగా ఎవరైనా వుంటే వాడి బయోపిక్ అంటూ తీసినా అర్ధం పర్ధం. 

ఎవరెలా చేశారు  

తెలంగాణా యాసతో వైజాగ్ కి చెందిన సుధాకర్ తెలంగాణా ఆర్టిస్టుల్ని తలదనేట్టున్నాడు. నటించగలగడం అతడికున్న పెద్ద అర్హత. నటనలో ఈజ్ వున్న వాడు ఏ యాసనైనా పండించగలడు. ఇందులో రాసిన తెలంగాణా డైలాగులు రొటీన్ గా, కృత్రిమంగా లేవు. బజార్లలో వినపడే సహజ భాషే ఇందులో దొర్లింది. కాబట్టి మనకి థియేటర్లో కూర్చున్నట్టు వుండదు, బజార్లో కూర్చుని చూస్తున్నట్టు వుంటుంది. భాషా పరంగా ఇదొక ప్రయోగం, ఇంతవరకూ దృష్టి పెట్టని ప్రయోగం. హైదరాబాదీ జీవితంతో అనుభవముంటేనే ఇలా రాయగలరు. ‘హైదరాబాదీలు నంబర్ వన్ గా ప్లాన్ చేస్తారు, పనులు నెమ్మళంగా చేస్తారు’ అన్న డైలాగు ఇందుకుదాహరణ. అమెరికాలో పాత్రలకీ ఇదే వరస. అక్కడి హైదరాబాదీ ముస్లిం పాత్రలకి వాడిన భాష, అది పలికే తీరూ చూసి హైదరాబాదీలు ఫిదా ఆయిపోతారు. హైదరాబాదీ కామెడీ సినిమాల తర్వాత ఒక తెలుగు సినిమా ఇలా వచ్చినందుకు గర్విస్తారు. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు.

 అయితే సుధాకర్ పోషించిన ఈ పాత్రకి ఒక తాడూ బొంగరం లేకపోవడంతో, అదెటు సాగిపోతోందో అర్ధంగాని పరిస్థితి. పైగా అనేక ఉప కథలు. పాత్రా నటనా బావున్నాయి గానీ వాటికీ బయోపిక్ కథతోనే ఇబ్బంది వచ్చింది. హీరోయిన్ నిత్యా శెట్టి అమెరిక సీన్స్ లో హత్గావుంది. సరూర్ నగర్ సీన్స్ లో ఒకలా వుంది. షూటింగులో చాల గ్యాప్ వచ్చిందో ఏమో. 

తల్లి పాత్రలో నిరోషా ఓకే. ఆమెకి కిడ్నీ, సమస్య, కారు యాక్సిడెంట్ సమస్య, చాలా సమస్యలు పెట్టారు. ఇక సర్ప్రైజ్ ఎంట్రీ వరుణ్ సందేశ్, శేఖర్ కమ్ముల పరిచయం చేసిన యూత్ హీరోగా కనుమరుగైన వరుణ్ సందేశ్-  చాలా కాలం తర్వాత హీరో ప్రెండ్ గా నటిస్తూ తిరిగి వచ్చాడు. ఇప్పుడింకా బావున్నాడు. ఇలాటి సహాయపాత్రలు అతడికి మేలు చేస్తాయి. రవివర్మ విలన్లలో ఒకడు (అజర్) గా నటించాడు. సరూర్ నగర్ హీరో ఫ్రెండ్స్ గా  నటించిన వాళ్ళు మాస్ కామెడీలు చేశారు. 

అమెరికాలోని ఉటా రాష్ట్రంలో షూటింగు జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా ప్రకటించారు నిర్మాతలు. అక్కడి ప్రక్రుతి అందాలు బాగా చూపించాడు కెమెరా మాన్ వెంకట్ దిలీప్. హైదరాబాద్ దృశ్యాలూ గ్లామర్ కోసం ప్రాకులాడకుండా రియలిస్టిక్ ధోరణిలో చిత్రీకరించారు. ఇక సురేష్ బొబ్బిలి సంగీతం హైదరాబాద్ దృశ్యాల్లో హైదరాబాద్ కల్చర్ ని పట్టుకోలేక పోయిందనేది వాస్తవం. ఎడిటింగ్ బావున్నా నిడివి విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఈ రోమాంటిక్ కామెడీకి రెండున్నర గంటల నిడివి చాలా ఎక్కువ. 

చివరికేమిటి?

ఒక రొమాంటిక్ కామెడీ బయోపిక్ అయింది. కథకి స్ట్రక్చర్ లేకపోవడంతో, హీరో ఏ సమస్యని ఎదుర్కోవాలో స్పష్టత లేకపోవడంతో ఇంటర్వెల్ వరకూ గంటం పావు సేపు ఎన్నో ఉప కథలుగా సాగింది. ఇందులో మొదటి అరగంట ఎన్నో సినిమాల్లో ఉన్నట్టే ఆవారా హీరో ప్రేమ కథ, ఇది కూడా సిల్లీగా వుండడం. అరగంట తర్వాత అమెరికా కొచ్చాక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా ఆసక్తికర సీన్లు వస్తూంటాయి. అమెరికాలో తెలుగు వాళ్ళ మీద చాలా దాడులు జరుగుతున్నాయి.  అలాటి ఒక దాడిని క్రియేట్ చేసి వాళ్ళని హీరో ఒక్క కిక్ తో మట్టి కరిపించినట్టు చూపించడం ఇన్స్ పైరింగ్ గా, పవర్ఫుల్ గా వుంది. వాళ్ళ చేతిలో చావడం కాదు, చావుని ఎదుర్కొంటూ మెరుపు దాడి చేయడం నేర్చుకోవాలన్నట్టు వుంది. ఇలా ఒక్క ఇండియా నుంచి వచ్చిన సూరి లాంటి గల్లీ పోరగాడే చేయగలడమో. అక్షరం ముక్క రాక వాడు అమెరికా పోయినా కింగ్ లా వుంటాడు. 

 అయితే ఇలాటి రాకరకాల సంఘటనలు చూపిస్తూ పాయింటు మీదికి రావడానికి ఇంటర్వల్ వరకూ చాలా సమయం తినేశాడు దర్శకుడు. ఇక్కడ రంజాన్ పండగ నాడు ఏడు వేల డాలర్లు సంపాదించడం హీరో గోల్. ఈ గోల్ కి మధ్య మధ్యలో ఇంటి దగ్గర్నుంచి తల్లి, చెల్లెలు, ఫ్రెండ్స్ సెంటిమెంట్ సీన్లు, ఇటు అమెరికా ఫ్రెండ్ తో సీన్లు… ఇలా కథ అనుకున్న పాయింటు మీద సాగకుండా దారి తప్పి నడుస్తూంటుంది. సెకండాఫ్ లో ఇదే పరిస్థితి. దీనివల్ల గ్రీన్ కార్డు కోసం నేరాలు చేయడానికి సిద్ధపడ్డ హీరోకి అడ్డంకులు ఏర్పడే సన్నివేశాలు మర్చిపోయి, నల్లేరు నడకలా సాగించడంతో పాత్రా, దాని కథా తేలిపోతూ తేలిపోతూ ఆఖరికి ముగింపు సోసోగా  సరిపుచ్చుకుంది. 

ఈ సినిమాకి యూత్ అప్పీల్ ఏమిటంటే రోమాంటిక్సే. డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్ళడం, అక్కడ అడ్డదార్లు తొక్కడం యూత్ కి ఆకట్టుకునే ఎకనమిక్స్ కథ గాకుండా పోయింది. అలాంటప్పుడు నెగెటివ్ షెడ్ తో వున్న ఎకనామిక్స్ ని నేపథ్యంగా పెట్టుకుని, రోమాంటిక్స్ తో ప్రత్యక్ష కథ నడిపితే యూత్ అప్పీల్ వచ్చేది. హీరోకి ఒకరుకాదు, ముగ్గురు హీరోయిన్లున్నా గ్రీన్ కార్డు కోసం పెళ్లి డైనమిక్స్ కథని  పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

―సికిందర్