Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజులపాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.విదేశాలకు వెళ్లిన తెలుగువారంతా ఒకే వేదిక మీదకు రావడం సంతోషంగా ఉందన్నారు.
విదేశాలకు వెళ్లిన వారితో తెలుగు అనుబంధం తగ్గిపోతుందని ఈయన తెలిపారు. మీరు ఏ దేశానికి వెళ్లిన ఎన్ని భాషలు మాట్లాడిన తెలుగు భాషను తక్కువ చేయొద్దని తెలిపారు.హైదరాబాద్‌లో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలున్నాయని, నగర అభివృద్ధికి పాటుపడేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
రాజీవ్ గాంధీ మన దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేస్తూ సాంకేతికతవైపు నడిపించారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ తెలిపారు. ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతమంతా ఎంతో సాంకేతికతతో అభివృద్ధి చెందిందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు తర్వాత వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులతో మరింత ముందుకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్నటువంటి బల్క్ డ్రగ్స్ దాదాపు 35 శాతం మన హైదరాబాద్ నుంచి తయారవుతున్నాయి అంటే అందుకు కారణం వైయస్సార్ గారు తీసుకున్న నిర్ణయం అని తెలిపారు.
తెలంగాణలో కేవలం హైదరాబాద్ నుంచి 65% ఆదాయం వస్తుంది అంటే అప్పటి ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలే కారణం అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.