AP: ఏపీలో తెల్లారగానే పింఛన్ ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా…. వారి బాధలు పట్టవా?

AP: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ఇంటి వద్దకే పాలనను అందజేశారు .ముఖ్యంగా అవ్వ తాతలు పెన్షన్ కోసం కొన్ని మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితిల నుంచి వారికి ఉపశమనం కల్పిస్తూ వాలంటీర్ ద్వారానే ఉదయం తెల్లవారుగానే వాలంటీర్లు వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ అందజేసేవారు. ఇక వాలంటీర్లు సొంత గ్రామంలోనే ఉంటారు అంతేకాకుండా వారి సమీప యాభై ఇళ్లకు మాత్రమే వారి బాధ్యత కనుక తెల్లవారుగానే పింఛన్ పంపిణీ చేసేవారు.

ఇక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తొలగించడంతో అదే బాధ్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఇచ్చేశారు. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పూర్తిగా తప్పుపట్టారు. ముందుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు సొంత గ్రామంలోని నివసించరు. వారు ఇతర గ్రామాలలో ఉంటారు అటువంటి సమయంలో ఉదయం 5 గంటలకే పెన్షన్ పంపిణీ చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ఇతర గ్రామాల నుంచి వారు ఉద్యోగం చేస్తున్న చోటకి వెళ్ళాలి అంటే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గర్భిణీ ఉద్యోగస్తులు కూడా ఆ సమయానికే వచ్చి పింఛన్ అందజేయడం అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారి ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా అంటూ ఈయన ప్రశ్నించారు.

తెల్లవారుజామున 5 గంటలకే పెన్షన్ పంపిణీ చేయకపోతే ప్రపంచమేమైనా తలకిందుల అవుతుందా అంటూ ప్రశ్నించారు.వేకువజామున ప్రయాణం అంటే చాలా ప్రమాదంతో కూడుకున్న విషయమని తెలిపారు. వేకువజామున 5 గంటలకు ఇచ్చే పింఛన్.. 8 గంటలకు ఇస్తే నష్టం ఏముందని వెంకట్రాంరెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.