తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినప్పటికి మంత్రివర్గ విస్తరణ కాకపోవడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. కేసీఆర్ కేబినేట్ విస్తరణ ఎప్పుడు చేస్తారో, ఎవరెవరికి అందులో అవకాశం దక్కుతుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే మంత్రి పదవులకు చాలా కాంపిటేషన్ ఉండడంతో మంత్రి పదవులు దక్కని వారిని మరోలా సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ వ్యూహాం రచిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి వర్గంలో సీఎంతో పాటు మరో 17 మందికి అవకాశం ఉంటుంది. అంటే కేబినేట్ లో మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్ తో పాటు హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అవకాశం ఉంది 16 మందికి. అయితే ఈ సారి మంత్రి పదవులకు మాత్రం చాలా మంది ఆశావహులు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ పై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని నేతల ద్వారా తెలుస్తోంది.
మరో 16 మందికి అవకాశం ఇచ్చినా కూడా మరో 20 మంది ఆశావహులు ఉంటారని కేసీఆర్ అంచనా వేస్తున్నారట. అందుకే వారిని కూడా సంతృప్తి పరిచేలా కేబినేట్ పదవితో సమానమైన పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత పాలనలోనే ఆరుగురిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు చట్ట విరుద్దంగా పార్లమెంటు కార్యదర్శి పదవులలో నియామకం చేశారని హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి పిటిషన్ తో పార్లమెంటరీ కార్యదర్శులు నియామకం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత సుఖేందర్ రెడ్డి టిఆర్ ఎస్ లో చేరారు.
ఈ సారి పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఝార్ఖండ్ , ఢిల్లీ మాదిరిగా ప్రత్యేక చట్టం చేసి మొత్తం 18 మందికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 18 మందికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలైనట్టు సమాచారం. ఆ 18 మందిలో వీరికి పార్లమెంటరీ కార్యదర్శులుగా అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 18 మంది మంత్రులు, 18 మంది పార్లమెంటరీ కార్యదర్శులు అంటే దాదాపు 36 మంది కేబినేట్ స్థాయిలో ఉంటారు. స్పీకర్, డిప్యూటి స్పీకర్ గా మరో ఇద్దరికి అవకాశం దక్కుతుంది. ఇప్పటికే నేతలు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
పార్లమెంటరీ కార్యదర్శి పదవులు దక్కే అవకాశం ఉన్న అభ్యర్దులు వీరే
ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్
వరంగల్- అరూరి రమేష్, దాస్యం వినయ్ భాస్కర్
నల్లగొండ- నోముల నర్సింహ్మయ్య, రమావత్ రవీంద్ర కుమార్, గొంగిడి సునీత, గ్యాదరి కిషోర్ కుమార్
నిజామాబాద్- బాజిరెడ్డి గోవర్ధన్, గంపా గోవర్ధన్, షకీల్ అహ్మద్
ఆదిలాబాద్- రేఖానాయక్, కోనేరు కొనప్ప, బాల్క సుమన్
కరీంనగర్- ఒడితెల సతీష్ కుమార్, గంగుల కమలాకర్
మెదక్- సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి
మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు
రంగారెడ్డి – కేపీ వివేకానంద
వీరిలో 18 మందికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వచ్చి చేరితే అప్పటికప్పుడు కూడా మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కని వారిని ఈ విధంగా సంతృప్తి పరిచేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది.