తెలంగాణ భవిష్యత్తు దిశను మార్చే చారిత్రాత్మక అడుగులు వేయడంలో.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక మలుపుగా మారుతోంది. భారతదేశం నుంచే కాదు.. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో తెలంగాణ ఆర్థిక శక్తి మరింత వేగంగా పెరుగుతోంది. ఈ సదస్సు తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులకు మార్గం తెరవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక విజయంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నేతృత్వంలోని వంతారా బృందం తెలంగాణ ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. భవిష్యత్తు నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గుజరాత్ వంతారాలో ఉన్న అత్యాధునిక సదుపాయాలన్నీ ఇదే స్థాయిలో తెలంగాణలోనూ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అటవీశాఖతో ఈ ఎంవోయూ పూర్తయింది. ఈ నెలాఖరున గుజరాత్ వంతారాను స్వయంగా సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించనున్నట్లు సీఎం ప్రకటించారు.
మరోవైపు విద్యుత్ రంగంలో ఒక్క రోజులోనే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం దేశవ్యాప్తంగా తెలంగాణపై ఉన్న పెట్టుబడి నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులపై దేశ, విదేశీ సంస్థలు భారీగా ఆసక్తి చూపించాయి. ఇది భవిష్యత్తులో తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగుగా మారనుంది.
ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. ఈ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి ప్రయాణానికి సంబంధించిన 2047 విజన్‌ను సవివరంగా వివరించారు.
ఇదే సమయంలో మైహోమ్ పవర్ సంస్థ కూడా తెలంగాణలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం మరో కీలక పరిణామంగా మారింది. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 12,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా పలువురు పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులపై చర్చలు కొనసాగుతున్నాయి.
సదస్సులో మాట్లాడిన సీఎం రేవంత్.. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు కొందరికి కష్టంగా అనిపించవచ్చు. కానీ వాటిని సాధించగల శక్తి, సంకల్పం మాకుంది. నిన్నటి వరకు ఒక కలగా కనిపించిన విషయాలు, ఇవాళ మీ మద్దతుతో కార్యాచరణగా మారాయి. కష్టమైతే ఇంకా వేగంగా ముందుకు వెళ్లాలని మా బృందానికి చెబుతున్నాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో మీరు అందరూ భాగస్వాములు కావాలి” అంటూ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద మొదలవ్వడమే కాదు.. భవిష్యత్తు భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక కేంద్రంగా మారే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
