భారత్ సింధు నది నీటిపై కఠిన నిర్ణయాల తర్వాత పాకిస్తాన్‌కు మరో షాక్. కునార్ నది జలాలను మళ్లించేందుకు తాలిబన్ నిర్ణయం.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో నీటి సంక్షోభం మరింత తీవ్రం కానుందా?
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు పాకిస్తాన్‌ను ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టేశాయి. సింధు నది ఒప్పందాన్ని అమలు పరంగా పరిమితం చేయడంతో ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాక్‌కు ఇప్పుడు మరో అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఆ దెబ్బ సరిహద్దు అవతలి నుంచి కాదు, సొంత పొరుగుదేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచే రావడం విశేషం.
ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైంది. కునార్ నది జలాలను తమ దేశంలోని నంగర్‌హార్ ప్రాంతానికి మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చేరే నీటి ప్రవాహం భారీగా తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే భారత్ నీటి సరఫరాపై కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో, ఈ తాజా పరిణామం పాక్‌కు డబుల్ షాక్‌గా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వర్గాల ప్రకారం, కునార్ నది నుంచి నంగర్‌హార్‌లోని దారుంటా ఆనకట్టకు నీటిని మళ్లించే ప్రతిపాదనకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను ఆర్థిక కమిషన్ ముందుకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని తాలిబన్ భావిస్తోంది. అయితే ఇదే సమయంలో పాక్‌కు చేరే నీరు తగ్గిపోవడం అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దాదాపు 500 కిలోమీటర్ల పొడవున్న కునార్ నది, హిందూ కుష్ పర్వత శ్రేణిలో పుట్టి ఆఫ్ఘనిస్తాన్ గుండా ప్రవహించి పాకిస్తాన్‌లో కాబూల్ నదిలో కలుస్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి ఈ నది తాగునీరు, సాగునీరు, జలవిద్యుత్‌కు ప్రధాన ఆధారం. అలాంటి నదిపై ఆనకట్ట నిర్మాణం జరిగితే అక్కడి ప్రజల జీవన విధానమే తారుమారు అయ్యే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.
ముఖ్యంగా భారత్‌తో ఉన్న సింధు జల ఒప్పందంలా పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్‌తో ఎలాంటి నీటి ఒప్పందం లేకపోవడం ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారింది. తాలిబన్ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించే చట్టబద్ధమైన మార్గాలు లేకపోవడంతో ఇస్లామాబాద్ అసహాయ స్థితిలో పడింది. ఈ పరిణామాలు పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
