Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. 4,157 గ్రామాల్లో పోరు..!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తవగా, మూడో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 17న జరిగే ఈ పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. మూడో దశలో మొత్తం 4,157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 394 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అయితే 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు రాకపోవడం గమనార్హం. మిగిలిన 3,752 సర్పంచ్ పదవుల కోసం 12,640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామస్థాయిలో ఈ స్థాయి పోటీ ఉండటంతో పోలింగ్ రోజు ఆసక్తికరంగా మారనుంది.

వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ పోటీ తీవ్రంగానే ఉంది. మొత్తం 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ కాగా, 112 స్థానాలకు నామినేషన్లు రాలేదు. 7,916 వార్డులు ఏకగ్రీవంగా ముగిశాయి. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటర్ల నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

మునుపటి రెండు విడతల్లో చోటుచేసుకున్న ఘటనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చెల్లని ఓట్లు ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలింగ్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిసెంబర్ 15 సాయంత్రం నుంచి 18 ఉదయం 10 గంటల వరకు ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ చేపట్టనున్నారు.

ఇదిలా ఉండగా, రెండో విడత ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచింది. మొత్తం సర్పంచ్ స్థానాల్లో సగానికి మించిన స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా గణనీయమైన స్థానాలను దక్కించుకున్నారు. ఈ ఫలితాల ప్రభావం మూడో దశపై పడుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఎన్నికలు పూర్తయిన అనంతరం డిసెంబర్ 20న గ్రామ పంచాయతీల తొలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ రోజే నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించగా, ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు జిల్లాలకు విడుదలయ్యాయి. అవసరమైతే అదనపు నిధులు కూడా విడుదల చేసే అవకాశముందని సమాచారం.