ఇంట్లో పూజ చేసే దేవుడి విగ్రహం పగిలిపోతే చాలామందికి ఒక్కసారిగా మనసు కలత చెందుతుంది. ఇప్పుడు ఏం చేయాలి.. దానిని ఎక్కడ ఉంచాలి?.. ఎక్కడ తీసుకెళ్లాలి.. అనే సందేహాలు వెంటనే మొదలవుతాయి. తెలియకపోయినా ఏదైనా ప్రమాదం జరిగిపోతుందేమో అన్న భయమే ఈ గందరగోళానికి కారణం. అయితే శాస్త్రం, సంప్రదాయం చెప్పేది ఒకటే.. విధానాల కంటే మన ఉద్దేశమే ముఖ్యమని.
పాడైపోయిన విగ్రహాన్ని ఇంట్లో దాచిపెట్టడం గానీ, భయంతో అలాగే ఉంచడం గానీ సరైన పరిష్కారం కాదు. భక్తితో, ప్రశాంతంగా పంపించడమే ఉత్తమ మార్గం. అందుకు అత్యంత సాధారణంగా అనుసరించే పద్ధతి నీటిలో నిమజ్జనం. సమీప నది, చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేసే ముందు విగ్రహాన్ని శుభ్రపరిచి, పువ్వు లేదా అగరుబత్తి సమర్పించి, చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఇది దేవుడికి కృతజ్ఞత తెలిపినట్టుగా భావిస్తారు.
నిమజ్జనం సాధ్యం కాకపోతే, ఆలయాలకు అప్పగించడం మరో విశ్వసనీయ మార్గం. అనేక దేవాలయాలు పాతగా మారిన లేదా దెబ్బతిన్న ఇత్తడి విగ్రహాలను స్వీకరిస్తాయి. వాటిని కరిగించి, కొత్త విగ్రహాలు లేదా పూజా సామాగ్రిగా మళ్లీ ఉపయోగిస్తారు. ఒక రూపంలో ముగిసిన పవిత్రత, మరొక రూపంలో కొనసాగుతుందనే భావన భక్తులకు మనశ్శాంతినిస్తుంది.
కొంతమంది మరింత వ్యక్తిగతంగా, సంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు. శుభ్రమైన కాటన్ వస్త్రంలో విగ్రహాన్ని చుట్టి, రావి చెట్టు కింద ఉంచడం లేదా తోటలో ప్రశాంతమైన మూలలో పాతిపెట్టడం కూడా చాలాచోట్ల కనిపించే పద్ధతే. ఇది గౌరవంతో చేసిన వీడ్కోలుగా భావిస్తారు. అయితే కొన్ని పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పెద్దలు హెచ్చరిస్తున్నారు. పూజించిన విగ్రహాన్ని సాధారణ చెత్తగా చూడడం, చెత్తబుట్టలో వేయడం చాలా మందికి మానసిక అసంతృప్తిని కలిగిస్తుంది. అలాగే డబ్బు కోసం స్క్రాప్‌గా అమ్మడం కూడా భక్తి భావనకు విరుద్ధంగా పరిగణిస్తారు. భయంతో బీరువాల్లో దాచి ఉంచడం కూడా సమస్యను పరిష్కరించదు, మనలోని అశాంతినే పెంచుతుంది.
విగ్రహాన్ని గౌరవంగా పంపించిన తర్వాత, పూజా స్థలాన్ని రీసెట్ చేయడం కూడా ముఖ్యమే. కొన్ని రోజులు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం, గంగాజలం లేదా శుద్ధి చేసిన నీటిని ఆ మూలలో చల్లడం ద్వారా ఇంట్లో ప్రశాంతత తిరిగి వస్తుందని విశ్వాసం. సరైన సమయం వచ్చినప్పుడు, చెక్కుచెదరని కొత్త విగ్రహం లేదా దేవుడి ఫోటోను ప్రతిష్ఠిస్తే ఆ స్థలం మళ్లీ పవిత్రతను సంతరించుకుంటుంది. నిపుణులు, పూజారులు ఒక మాటే చెబుతున్నారు.. ఖచ్చితమైన నియమాల కంటే మన ఉద్దేశం, మన భక్తి ముఖ్యమైనవి. భయం కాదు, గౌరవం మరియు కృతజ్ఞతే సరైన మార్గం అని చెబుతున్నారు.
