సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో..గోదావరి జిల్లాల్లో సందడి మొదలైంది. పండుగ వాతావరణం మెల్లగా ఊపందుకుంటుండగా, కోడి పందాల చుట్టూ ఏర్పాట్లు మాత్రం పూర్తిస్థాయిలో సాగుతున్నాయన్న ప్రచారం వినిపిస్తోంది. పందెం రాయుళ్లు, నిర్వాహకులు, మధ్యవర్తులు, అందరూ తమ తమ స్థాయిలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎక్కడ బరులు ఉండాలి, ఎవరు ఏ సిండికేట్‌లో ఉండాలి, పందెం వేయడానికి వచ్చే వీఐపీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అన్నదానిపై ముందస్తు లెక్కలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ప్రతి ఏటా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం చేరుతుంటారు. ఈసారి కూడా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి సైతం కొందరు రానున్నారనే ప్రచారం ఉంది. దీంతో భీమవరం, ఉండి, కాళ్ల, వీరవాసరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జీలు ముందుగానే బుక్ అవుతున్నాయి. పండుగ పేరుతో ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు.
మరోవైపు పందాలకు సిద్ధమయ్యే పుంజుల తయారీ ఏడాది ముందే మొదలవుతుంది. ప్రత్యేక మకాంలలో వాటికి శ్రద్ధగా మేత, వ్యాయామం, ఈత శిక్షణ ఇస్తున్నారు. బాదం, జీడిపప్పు, గుడ్డు, ఆకుకూరలు వంటి ఆహారంతో బలంగా పెంచుతూ, పోరాటానికి అనువుగా తీర్చిదిద్దుతున్నారు. స్వయంగా పెంచుకోలేని వారు మంచి జాతి పుంజుల కోసం మకాంల వద్ద పోటీ పడుతూ కొనుగోళ్లు చేస్తున్నారు. ఈసారి డిమాండ్ పెరగడంతో ఒక్కో పుంజు ధరలు యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకూ పలుకుతున్నాయి.
ఈ సంక్రాంతికి పందాలు లక్షల్లోనే కాకుండా కోట్లలో సాగుతాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఏ రకమైన పుంజులు వదలాలి, ఏ సమయంలో ఎంత మొత్తం పందెం వేయాలన్నదానిపై కొత్త తరహా వ్యూహాలు రూపొందుతున్నాయని సమాచారం. రంగు, జాతితో పాటు పుంజుల ప్రవర్తనను బట్టి పందాలు వేయడం ‘కుక్కుట శాస్త్రం’ పాటించడం కూడా కొందరిలో పెరుగుతోంది. మొత్తంగా ఈసారి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మరింత ఉత్కంఠభరితంగా మారనుందన్న మాట వినిపిస్తోంది.
