టిఆర్ఎస్ బొడిగ శోభ సంచలన నిర్ణయం

టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మొదటి జాబితాలో శోభకు టికెట్ దక్కలేదు. 2014 లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శోభ పై పలు వివాదాలు ఉన్నాయి. దీంతో కేసీఆర్  చొప్పదండికి టికెటు కేటాయించకుండా పెండింగ్ లో ఉంచారు.

ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇప్పటికి టికెటు కేటాయించకపోవడంతో శోభ సోమవారం సాయంత్రం 6 మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. తన భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించిన శోభకు బిజెపిలో చేరాలని కార్యకర్తలు సూచించినట్టు తెలుస్తోంది. అదే విధంగా టిఆర్ఎస్ కు కూడా తన టికెట్ పై తేల్చాలని శోభ అల్టీమేటం జారీ చేసినట్టు సమాచారం. దీని పై శోభ మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తారని తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పెద్దలు శోభ పార్టీని వీడకుండా చూడాలని ముఖ్య నేతలను రంగంలోకి దింపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అల్టీమేటం పై నేతలు స్పందించకపోవడంతో శోభ మంగళవారం మీడియా సమావేశంలో తన భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తారని తెలుస్తోంది.

శోభకు టికెట్ ఇవ్వవద్దని ఆమెకు టికెట్ ఇస్తే అక్కడ ఓటమి ఖాయమని చొప్పదండికి చెందిన కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ ను కలిసి విన్నవించారు. ఆమె పలుసార్లు వివాదాలలో నిలిచారని వారు కేసీఆర్ కు తెలిపారు. టోల్ గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదం, ఫోన్లలో అధికారులను బెదిరించిన ఆడియోలు వైరల్ గా మారాయి. 

2014 ఎన్నికల తర్వాత తొలినాళ్లలోనే బొడిగె శోభ వివాదాల్లో చిక్కున్నారు. వెలమ రావులకే అధికారులు రెస్పెక్ట్ ఇస్తారా?మమ్మల్ని లెక్క చేయరా అంటూ ఆమె కొందరు అధికారుల మీద ఫైర్ అయ్యారు. ఈ కామెంట్స్ ను కూడా టిఆర్ఎస్ అధినేత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులను బొడిగె శోభ బెదిరిస్తున్నారని, పార్టీ నేతలను అవమానకరంగా మాట్లాడుతున్నారని కొందరు నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.  అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక నేతలను కలుపుకుపోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వారు ఆరో్పించారు.

ఎస్.జి.ఎస్. పేరుతో సొంత సైన్యం స్థాపించుకుని ప్రజలను, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారానికి పిలిచినా, గైర్హాజరయ్యారని చెప్పారు. అధికారిక కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, ఆమె భర్త పాల్గొంటే మంత్రి, ఎంపి ముందే అవమానించిన సంఘటనను వివరించారు. పేద ప్రజల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిచండంతో పాటు కేసులు పెట్టినస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు.

వీటన్నింటిని పరిశీలించాకనే కేసీఆర్ ఆమెకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించారని తెలుస్తోంది. ఎంపిపిలు, జడ్పీటిసిలు, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి నేతలంతా ఫిర్యాదు చేయడంతోనే చొప్పదండి పై నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ ఉన్నారని నేతలంటున్నారు. బొడిగే శోభ మంగళవారం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో అని అంతటా చర్చ జరుగుతోంది.