ఎంపీపై కత్తితో దాడి.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నాయి. ఈ సమయంలో అనూహ్యంగా అధికార పార్టీ ఎంపీపై హత్యాయత్నం జరిగింది.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై, ఎన్నికల ప్రచార సమయంలోనే ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కొత్త ప్రభాకర్ రెడ్డికి గాయాలు కాగా, ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డికి వైద్య చికిత్స అందుతోంది.

ఊహించని ఈ ఘటనతో తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. దాడి చేసింది బీజేపీ మద్దతుదారుడనీ, కాంగ్రెస్ మద్దతుదారుడనీ.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో వుండి, ఇటీవల నిందితుడు బీజేపీలో చేరినట్లుగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం.

దుబ్బాక నియోజకవర్గంలో ఈ దాడి జరగ్గా, ఆ దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ అనుచరుడిగా నిందితుడి గురించి చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. దాంతో, తెలంగాణ రాజకీయాల్లో పెను కలకలం రేగుతోంది.

మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి వ్యవహారానికీ, తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడికీ లింకు పెడుతూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దురదృష్టవశాత్తూ నేరమయ రాజకీయాలే ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ తరహా హింసా చర్యలను ప్రోత్సహించకూడదు.!