భారత్ రాష్ట్ర సమితి.. ఆ సౌండింగ్, తెలంగాణ సమాజానికి అంతగా కనెక్ట్ కాలేదు.! జాతీయ స్థాయిలో రాజకీయం చేస్తామని నినదించి, రాష్ట్ర స్థాయిలో సొంత గడ్డ మీద బోల్తా కొట్టింది గులాబీ పార్టీ.!
తెలంగాణ రాష్ట్ర సమితి.. అంటే, ఆ కిక్కే వేరు.! టీఆర్ఎస్ అంటే, తెలంగాణ ఇంటి పార్టీ.! ఔను, తెలంగాణ సమాజం అంతలా టీఆర్ఎస్ అనే పేరుని ఓన్ చేసుకుంది. కానీ, జాతీయ స్థాయిలో రాజకీయమంటూ, గులాబీ పార్టీ పేరు మార్చేసుకుంది. అక్కడే తొలి దెబ్బ పడింది.!
వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీయార్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగా ఓడిపోయారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాల్లో ‘తెలంగాణ పేరు లేకపోవడం’ కూడా బలమైన కారణమే.!
అందుకే, తమ పార్టీ పేరుని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగానే మార్చాలనే డిమాండ్లు తెరపైకి తెస్తున్నారు పలువురు గులాబీ నేతలు. గులాబీ బాస్ వద్దకు కూడా ఈ ప్రస్తావన తీసుకెళుతున్నారట. ప్రస్తావన కాదిది, డిమాండ్ కూడా.!
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ శాఖను తెరిచారు ఆ మధ్య. అదిప్పుడు దాదాపుగా మూతబడింది. తెలంగాణలోనే చాలా నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ షట్టర్ డౌన్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీ పేరుని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చెయ్యాలనీ, లేకపోతే ఖేల్ ఖతం అనీ.. గులాబీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.. అధినాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
కానీ, పార్టీ పేరు మార్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యమే.!