ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్ ఘనంగా నిర్వహించాలనుకున్న కార్యక్రమాల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ఒకటి. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని పేదవారు ఉండకూడదనేది తన లక్ష్యమని, అందుకే 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ సంకల్పించారు. అందులో భాగంగా తొలిదశలో 15 లక్షల మందికి ముందుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం. అందుకోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూముల సేకరణ కూడా చేపట్టారు. ఈ స్థలాల పంపిణీ మీద పేద ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు. అందుకు కారణం ప్రభుత్వం ఇచ్చే ఈ భూములను అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించడం. ఇళ్ల స్థలాల పంపిణీ అనేది వైఎస్ జగన్ చేస్తున్న కొత్త పనేమీ కాదు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు ఈ పని చేశాయి. కానీ స్థలాలు ఇచ్చినా, ఇళ్లు ఇచ్చినా వాటిని అనుభవించే హక్కే కానీ అమ్ముకునే హక్కు ఉండేది కాదు.
కానీ జగన్ మాత్రం అవసరమైనప్పుడు స్థలాలు అమ్ముకునేలా ఇళ్ల పట్టాలకు కన్వేయన్సు డీడ్లు ఇస్తామని ప్రకటించింది. అందుకే ఉచిత స్థలాల మీద పేదలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తమ పేరు మీద కూడా ఆస్థి రాబోతుందని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు ఇప్పుడప్పుడే ఫలించేలా కనబట్లేదు. ప్రతిసారీ పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటివరకు నాలుగుసార్లు వాయిదాపడింది. మొదట సంక్రాంతికి చేద్దామనుకోగా ఆ తర్వాత ఉగాదికి, ఆ తర్వాత వైఎస్ఆర్ జయంతికి అదీ కుదరక ఆగష్టు 15కు మార్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పంపిణీ జరుగిపోతుందని బల్లగుద్ది చెప్పారు. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది.
పట్టాల పంపిణీని ఈసారి కూడా చేయలేమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో పేదలు మరోసారి ఉసూరుమన్నారు. పంపిణీ గురించి మొదటి నుండి భారీగా ప్రచారం చేస్తూ వచ్చిన సర్కార్ సుమారు 26,000 ఎకరాల భూమిని సేకరించి పెట్టింది. లేఔట్లు వేసి సెంట్రింగ్ మెటీరియల్ సరఫరాకు గృహ నిర్మాణ శాఖకు టెండర్లు కూడా పిలిచింది. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మరి ఎందుకు ఆ మహత్తర కార్యక్రమాన్ని పూర్తిచేయలేకపోతోంది అంటే కారణం న్యాయపరమైన చిక్కులు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ భూ పంపిణీ మీద కేసులు నడుస్తున్నాయి. పేదల ఇళ్లకు కన్వేయన్సు డీడ్లు ఇవ్వకూడదనేది నియమం. కేవలం డీకేటీ, బీఫాం రూపంలోనే పట్టాలు ఇవ్వాలి. కానీ నియమాన్ని కాదని ఏపీ సర్కార్ విక్రయించుకునే హక్కును కూడా కల్పించడానికి పూనుకుంది.
దీని మీదే హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఉచిత పట్టాలకు కన్వేయన్సు డీడ్లు ఎలా ఇస్తారని, అది రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు ఆక్షేపించింది. దీంతో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇంకా అక్కడ కేసు తేలలేదు. వివాదం సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి అక్కడి నుండి నిర్ణయం వెలువడే వరకు హైకోర్టు తదుపరి నిర్ణయాన్ని ప్రకటించదు, పాత ఉత్తర్వులను మార్చదు. న్యాయ నిపుణులు మాత్రం రాజ్యంగవిరుద్దమైన ఈ పనికి సుప్రీం కోర్టులో సైతం చుక్కెదురవుతుందని, హైకోర్టు తీర్పునే సర్వోన్నత న్యాయస్థానం సమర్థిస్తుందని అంటున్నారు. ఆ భయం ప్రభుత్వంలో కూడా ఉంది. ఇకవేళ ధైర్యం చేసి పట్టాలు ఇచ్చేస్తే రేపు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చి పట్టాలు చెల్లవంటే ప్రభుత్వానికి తలవంపులు తప్పవు. ఇన్నాళ్లు ఎన్నో సంక్షేమ పథకాలతో తెచ్చుకున్న పేరు మొత్తం పోతుంది. ఇక ప్రతిపక్షాలకు అదొక పండుగలాంటి అవకాశమే అవుతుంది.
Read More : ఇండియా తొలి మహిళాప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్
అందుకే సర్కార్ వెనక్కి తగ్గుతూ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ వెళుతోంది. ప్రభుత్వం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కేసులు కామన్. చేసే పని చట్టబద్దంగా ఉంటే ఆ కేసులేమీ చేయలేవు. కాస్త ఆలస్యమైనా పని జరిగిపోతుంది. ఉదాహరణకు మూడు రాజధానుల బిల్లు. రాజ్యాంగ బద్దంగా ఉంది కాబట్టి ఎంత మంది అడ్డం పడినా ఆ బిల్లుకు ఆమోదం దొరికింది. హైకోర్టులో సైతం సానుకూల తీర్పు వచ్చే సూచనలున్నాయి. కానీ ఇళ్ల పట్టాల విషయంలోనే అంత బలం లేదు. చంద్రబాబాబు కేసులు వేసి అడ్డంపడుతున్నారని సర్కార్ నెపాన్ని ప్రతిపక్షం మీదికి నెట్టినా లాభం లేదు. అందుకే ముందు కేసుల నుండి బయటపడి, న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వస్తే సరి ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఆ తీర్పుకు తగ్గట్టు కార్యక్రమంలో మార్పులు ఏవైనా చేసి ఇళ్ల పట్టాలు పంచితే బాగుంటుంది. అంతేకానీ ఇలా ఇప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటూ ప్రచారం చేసి చివరకు వాయిదాలు వేస్తూ ఉంటే పేదలు మాటి మాటికీ ఊసురుమని చివరికి నమ్మకం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. –