Balineni: పదవి కోసమే బాలినేని అసత్యపు వ్యాఖ్యలు.. బాలినేని వ్యాఖ్యలపై చెవిరెడ్డి కామెంట్స్!

Balineni: జగన్ ప్రభుత్వ హయామంలో కీలకనేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసి కూటమికి మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా బాలినేని వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల బురద జల్లడాన్ని వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ముఖ్యంగా సెకీ ఒప్పందం గురించి బాలినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెకీ ఒప్పందం గురించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అర్ధరాత్రి జగన్ అందరినీ నిద్రలేపి సంతకాలు కావాలంటూ బలవంతం చేశారని తెలిపారు. ఇలా అర్ధరాత్రి సమయంలో సంతకాలు సేకరించడం ఏంటి అని ఇందులో ఏదో మతలబు ఉందని భావించి నేను సంతకం చేయలేదనీ జగన్మోహన్ రెడ్డి గురించి బాలినేని శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇలా బాలినేని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బాలినేని మాట్లాడటం చూస్తుంటే.. అబద్దాలు గొప్పగా ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. సెకీ ఒప్పందం రాష్ట్రానికి చాలా ప్రయోజనం కలిగిస్తుందన్న చెవిరెడ్డి.. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైకాపా ప్రభుత్వ హయాంలో 50 శాతం తక్కువకే ఒప్పందం జరిగిందని తెలిపారు.

ఈ విషయాలన్నీ తెలిసి కూడా బాలినేని ఇలా ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో నాకర్థం కాలేదు. ఆయన కూటమి ప్రభుత్వం నుంచి ఏం ఆశించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తూ బాలినేని వ్యక్తిత్వం చంపుకుంటున్నారని.. ఎమ్మెల్సీ ఇస్తారనే భ్రమలో ఉండి అలా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే బాలినేని ఎమ్మెల్సీ పదవి కోసం సుమారు 9 కోట్ల రూపాయల వరకు డబ్బులు కూడా ఇచ్చారంటూ చెవిరెడ్డి ఆరోపణలు చేశారు. మరి చెవిరెడ్డి ఆరోపణలపై బాలినేని స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.