హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్.. డేరింగ్ వర్మ భయపడుతున్నాడా!

ఎలాంటి విషయంలోనైనా డేరింగ్ అండ్ డాషింగ్ గా కనిపించే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనపై నమోదైన కేసు విషయంలో భయపడుతున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికలు ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే.

నారా లోకేష్, చంద్రబాబు తదితరులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ ఆక్ట్ కింద ఈ కేసు నమోదు అయింది. ఆయనపై కేసు నమోదు చేసి ఆయనను విచారణకు రావాలని పోలీసులు వర్మకి నోటీసులు కూడా పంపించారు అయితే వర్మ ఆ విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే. విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని, సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు ఆర్జీవి.

అలాగే ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది దాంతోపాటు ఆయన తాజాగా ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ లో పోలీసుల అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసుని కొట్టివేయాలని కోరారు. విచారించిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని, కేసును కొట్టివేయాలన్న పిటీషన్ ని మాత్రం విచారణకి స్వీకరించింది.

అలాగే కచ్చితంగా పోలీస్ విచారణకు హాజరు కావాల్సిందేనని కూడా ఆదేశించింది.ఈ క్రమంలో వర్మ హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. ఎవరి పరువుకు భంగం కలిగించే లాగా తాను పోస్టులు పెట్టలేదని, ఇరు వర్గాల మధ్య విరోధం పెంచేలా పోస్టులు చేయలేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని, అరెస్టు చేసినట్లయితే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటీషన్లో పేర్కొన్నారు.