తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళిగ వెట్రి కళిగం (టీవీకే ) పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి వెనకడుగు వేసిన చోట, తమిళ స్టార్ హీరో విజయకాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్నచోట సినీ నటుడు విజయ్ పార్టీ పెట్టి నిలదొక్కుకోగలడా, విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు తెస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అక్టోబర్ 27న విక్రమండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీవీకే పార్టీ పోటీపై క్లారిటీ ఇచ్చారు తమిళనాడు 2026 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే ఏ పార్టీతోను పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలకు తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఆ సభకు స్థలాన్ని కేటాయించిన రైతులకు టీవీకే అధ్యక్షుడు తాజాగా విందు ఏర్పాటు చేశారు. మహానాడు సభకి భూములు ఇచ్చినవారికి బంగారు ఉంగరాలను అందజేశారు.
సభకి భూములు ఇచ్చిన వారిని, వారి కుటుంబ సభ్యులను చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. వారికి తానే స్వయంగా భోజనం వడ్డించి తాంబూలం తో పాటు బట్టలు పండ్లు కానుకలు అందజేశారు. విజయ్ విల్లుపురం నుండి విక్రమ్ వాడే సమీపంలోని వీసాలే గ్రామంలో టీవీకే పార్టీ మహానాడు గత నెల 27న జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ సభ కోసం స్థలాన్ని అన్వేషించినప్పుడు అనుకున్నంత స్థలం సమీకరణ కాలేదు.
తర్వాత చెన్నై తిరుచి జాతీయ రహదారిలోని వీ శాలై వద్ద మహానాడు కోసం స్థలాన్ని ఇవ్వటానికి అనేకమంది రైతులు ముందుకు వచ్చారు. 207 ఎకరాల స్థలాన్ని మహానాడుకి కేటాయించగా ఒక్కొక్క ఎకరానికి పదివేల రూపాయలు అద్దే చెల్లించినట్లు సమాచారం. మహానాడు సభని ఎవరు ఊహించని విధంగా సినీ సెట్టింగులని తలదన్నేలా అద్భుతంగా వేదిక ఏర్పాటు చేశారు. మహానాడు సభ కూడా ఎవరు ఊహించని విధంగానే గ్రాండ్ సక్సెస్ అయింది.