టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ జోరు పెంచేశారు. మామూలుగా కాదు, నిత్యం చాలా అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నారు.. అధికార వైసీపీని విమర్శించే క్రమంలో. ప్రధాన ప్రతిపక్షం గనుక, తెలుగుదేశం పార్టీ.. అధికార వైసీపీ మీద విమర్శలు చేయడం సహజమే. కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా సభ్య సమాజానికి నారా లోకేష్ ఏం సంకేతాలు పంపుతున్నట్టు.? కొన్ని విషయాల్లో నారా లోకేష్ పోరాటాలు వర్కవుట్ అయిన మాట వాస్తవం. ఈ క్రమంలో ఆయన సంపాదించుకున్న పాజిటివ్ వైబ్స్ కాస్తా, ఇంకొన్నిసార్లు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కారణంగా నెగెటివ్ వైబ్స్‌గా మారిపోతున్నాయి. నిజానికి, టీడీపీలో యువ నాయకత్వం గట్టిగానే వుంది. ఆ యువ నాయకత్వాన్ని కలుపుకుపోవడంలో నారా లోకేష్ విఫలమవుతున్నారు. నారా లోకేష్ తప్ప, టీడీపీ యువ నాయకులెవరూ యాక్టివ్‌గా కనిపించడంలేదు.
పార్టీలో నారా లోకేష్ మాత్రమే ఎక్కువగా ప్రొజెక్ట్ అవ్వాలనే చంద్రబాబు స్క్రిప్ట్ కాస్తా పార్టీకి శాపంగా మారుతోంది. చంద్రబాబు కూడా ఏనాడూ తనకు పోటీగా పార్టీలో ఎవరూ గట్టిగా ఎదగకూడదనే భావనలో వుండేవారనీ, అదే ఇప్పుడు నారా లోకేష్ కూడా చేస్తున్నారన్న విమర్శలు టీడీపీ నేతల నుంచే ఆఫ్ ది రికార్డుగా వినవస్తున్నాయి. ఇక, వైసీపీని విమర్శించడం మీద పెట్టే శ్రద్ధలో పదో వంతు కూడా, బీజేపీని ఎదుర్కోవడంలో చూపడంలేదు. ఎందుకిలా.? ప్రత్యేక హోదా సహా చాలా విషయాల్లో కేంద్రాన్ని టీడీపీ నిలదీయాల్సి వుంది. అది టీడీపీ బాధ్యత కూడా. పెట్రో ధరల విషయమై నారా లోకేష్ పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. కానీ, పెట్రో ధరల పెంపుకి కారణం కేంద్రం. మరి, కేంద్రాన్నెందుకు నారా లోకేష్ నిలదీయలేకపోతున్నారు.? పార్లమెంటు సమావేశాలు ముగిశాక, వైసీపీ.. కేంద్రాన్ని నిలదీయలేదంటూ టీడీపీ పార్లమెంటు సభ్యులు గుస్సా అవడం.. టీడీపీ, బీజేపీ విషయంలో వ్యవహరిస్తున్న చిత్ర విచిత్రమైన వైఖరికి నిదర్శనం.