Vangalapudi Anitha: రాష్ట్ర పోలీసు శాఖలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగా సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను సిద్ధం చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నూతన ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్ (కేకే) బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
గత ఐదేళ్ల కాలంలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని మంత్రి అనిత ఆరోపించారు. 2019కి ముందు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన స్టేషన్లనే గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో తనను అరెస్టు చేసినప్పుడు, టీడీపీ హయాంలో నిర్మించిన ఒక మోడల్ పోలీస్ స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు.
Mahesh Kumar Goud: మాజీ మంత్రి హరీశ్ విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్ సంచలనం
Paritala Sunitha: జగన్ హయాంలో రాష్ట్రం వెనక్కి.. చంద్రబాబుతోనే ప్రగతి: పరిటాల సునీత
నిధుల వివరాలు – కీలక ప్రాజెక్టులు: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపట్టబోయే పనుల వివరాలను మంత్రి వెల్లడించారు:
ఇప్పటికే రూ.509 కోట్లతో పలు భవన నిర్మాణాలు చేపట్టారు.
త్వరలోనే రూ.179 కోట్లతో కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు.
రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్ భవనాల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కార్యాలయాల కొరతను తీర్చేందుకు అక్కడ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ ప్రాజెక్టులన్నీ కొత్త ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఎండీ రవిప్రకాశ్ నాయకత్వంలో విజయవంతంగా పూర్తి కావాలని మంత్రి ఆకాంక్షించారు.
రెండేళ్లలో లక్ష్యాలన్నీ పూర్తి చేస్తా: చైర్మన్ కేకే అనంతరం నూతన ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌లో ఒక్క ఇటుక కూడా కదల్లేదని విమర్శించారు. హోంమంత్రి, ఉన్నతాధికారుల సహకారంతో రెండేళ్లలోపు నిర్దేశిత పనులన్నీ పూర్తి చేసి సంస్థకు మంచి పేరు తెస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

