టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఆ షాక్‌కి కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కుప్పం మునిసిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రమైన షాక్‌లోకి వెళ్ళిపోయాయి.
‘మీరు ఓడిపోవడమేంటి చంద్రబాబుగారూ.?’ అంటూ మీమ్స్ కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అమరావతి పరిధిలో టీడీపీకి తగిలిన దెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఓడిపోయారు. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
అవన్నీ ఓ యెత్తు.. పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పం మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఇంకో యెత్తు. ఇదెలా జరిగింది.? అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపించారు వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
పెద్దిరెడ్డిని ఉద్దేశించి, ‘బస్తీ మే సవాల్’ అంటూ చంద్రబాబు విరుచుకుపడితే, కుప్పంలో సంగతి తేల్చేస్తామంటూ పెద్దిరెడ్డి ప్రతి సవాల్ విసిరి.. గెలిచి చూపించారు. ఇక, ఇక్కడితో టీడీపీ పని పూర్తిగా అయిపోయినట్లే. ఓటమికి కుంటి సాకులు వెతుక్కుంటూ, ‘నైతిక గెలుపు మాదే’ అని టీడీపీ చెప్పుకుంటే, ఆ పార్టీ ఇంకా దారుణమైన పతనాన్ని చూడబోతున్నట్టే.
ఓడిన ప్రతిసారీ టీడీపీ అధినేతకు కుంటి సాకులు వెతుక్కోవడం అలవాటే. ఇప్పుడూ ఆయన అదే చేస్తారు. అంతే తప్ప, డ్యామేజీ కంట్రోల్ చర్యలు చేపట్టరు. పార్టీ లేదు.. డాష్ లేదు.. అని ఏపీ టీడీపీ అధ్యక్షుడే కొన్నాళ్ళ క్రితం ‘ఆఫ్ ది రికార్డు’గా తేల్చేసిన తర్వాత.. టీడీపీ గురించి కొత్తగా మాట్లాడుకోడానికేముంటుంది.?