రేవంత్ రెడ్డి పొలిటికల్ చాప్టర్ క్లోజ్ చేసే దిశగా కేటీఆర్ బిగ్ మాస్టర్ ప్లాన్ !

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.  కాంగ్రెస్ పార్టీలో తెరాస మీద, కేసీఆర్ మీద ప్రభావవంతంగా పోరాటం చేస్తున్న నేత రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టడమే కేసీఆర్ పనిపట్టడానికి అన్నట్టు ఆరంభం నుండి రేవంత్ రెడ్డి దూకుడుగానే వెళుతున్నారు.  కేసీఆర్, కేటీఆర్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో రేవంత్ రెడ్డి తలదూరుస్తున్నారు.  పెద్ద దొర, పిల్ల దొర అంటూ తండ్రీకొడుకులను సంభోదిస్తూ రేవంత్ గుప్పించే విమర్శలు అన్నీ ఇన్నీ కావు.  కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ బలమైన నాయకులు, పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 కాబట్టి రేవంత్ రెడ్డిని తట్టుకుని నిలబడగలుగుతున్నారు కానీ సాదాసీదా లీడర్లు అయ్యుంటే మాత్రం తేలిపోయేవారే.  కొన్ని సంధర్భాల్లో నిజంగానే కేసీఆర్, కేటీఆర్ రేవంత్ మూలాన ఇబ్బందిపడిన మాట వాస్తవం.  

KTR preparing big plan to defeat Revanth Reddy
KTR preparing big plan to defeat Revanth Reddy

అందుకే రేవంత్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.  ప్రజెంట్ రేవంత్ ఎజెండా ఒక్కటే.  కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ ఆగమాగం చేయడం.  ఇందుకోసం పథక రచన కూడ చేసుకుంటున్నారు.  కరోనా కట్టడిలో విఫలమయ్యారని, కొండపోచమ్మ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని తీవ్రంగా దుయ్యబడుతున్నారు.  అందుకే ఇక ఊరుకుంటే లాభం లేదని రేవంత్ రెడ్డిని మూలాలతో సహా పెకలించాలని ప్లాన్ వేస్తున్నారట.  ఇందుకోసం రేవంత్ సొంత నియోజకవర్గమైన మల్కాజ్ గిరిని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇందుకు త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికలను వేదిక చేసుకున్నారట.  క్రితంసారి గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ గొప్ప పనితనం కనబర్చారు.  కేసీఆర్ ఊహించిన స్థాయి కంటే పెద్ద విజయాన్ని పార్టీకి కట్టబెట్టారు.  కాబట్టే ఈసారి కూడ గ్రేటర్ ఎన్నికల బాధ్యత ఆయనదే. 

ఈ భాద్యతల్లో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడం కూడ ఉంది.  రేవంత్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి తెరాస జెండా రెపరెపలాడేలా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు.  లాక్ డౌన్ సమయంలో అనేక నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది పనులకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది.  అందుకే అదే తరహాలో మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.  ఈ దెబ్బతో గ్రేటర్ ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పేర్లను పూర్తిగా కనుమరుగు చేయాలని, తద్వారా రేవంత్ రెడ్డి హవాకు అడ్డుకట్ట వేయాలనేది కేసీఆర్, కేటీఆర్ ఉద్దేశ్యం.