కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రయాణికులకు బంపర్ గిఫ్ట్ ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్. ‘సెయిల్ ఇన్ 2026’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక న్యూ ఇయర్ సేల్‌లో, పెద్దలతో పాటు చిన్నారుల ప్రయాణాన్ని కూడా మరింత చౌకగా మార్చింది. ముఖ్యంగా 0 నుంచి 24 నెలల వయస్సు గల శిశువులు కేవలం రూ.1కే దేశీయ విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా దేశీయ విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంటే, శిశువులకు ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుంది. అయితే చెక్-ఇన్ సమయంలో శిశువు వయస్సును నిర్ధారించే పత్రాలు తప్పనిసరి. జనన ధృవీకరణ పత్రం, ఆసుపత్రి డిశ్చార్జ్ పేపర్, టీకా సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్‌లో ఏదైనా ఒకదాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ రుజువు లేకపోతే, శిశువు టికెట్‌కు పూర్తి చార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో స్పష్టం చేసింది.
ఈ నూతన సంవత్సర సేల్ బుకింగ్‌లు జనవరి 13 నుంచి జనవరి 16, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో దేశీయ విమాన టిక్కెట్లు రూ.1,499 నుంచి, అంతర్జాతీయ విమాన టిక్కెట్లు రూ.4,499 నుంచి ప్రారంభమయ్యే ఆల్–ఇన్‌క్లూజివ్ వన్‌వే ఛార్జీలతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో ప్రీమియం ఇండిగో స్ట్రెచ్ సీట్లతో కూడిన విమానాలు కేవలం రూ.9,999 నుంచే అందుబాటులో ఉన్నాయి.
టిక్కెట్ ధరలకే కాకుండా, ఇండిగో తన 6E యాడ్–ఆన్ సేవలపై కూడా భారీ తగ్గింపులు ప్రకటించింది. ఫాస్ట్ ఫార్వర్డ్ సేవలపై 70 శాతం వరకు డిస్కౌంట్, ప్రీ–పెయిడ్ అదనపు బ్యాగేజీపై 50 శాతం వరకు తగ్గింపు, స్టాండర్డ్ సీటు ఎంపికపై 15 శాతం వరకు రాయితీ అందిస్తోంది. అదనంగా, ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ XL సీట్లు కేవలం రూ.500కే లభించడం మరో ఆకర్షణగా నిలుస్తోంది.
టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియను కూడా ఇండిగో మరింత సులభం చేసింది. ప్రయాణికులు ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు AI ఆధారిత అసిస్టెంట్ 6ESkai, వాట్సాప్ నంబర్ +91 70651 45858 లేదా ఎంపిక చేసిన ట్రావెల్ పార్టనర్ యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సేల్ ద్వారా కుటుంబంతో కలిసి, ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
