బ్రౌన్ బ్రెడ్ అని మోసపోకండి.. నిజమైన హెల్తీ బ్రెడ్ ఎలా గుర్తించాలో తెలుసా..?

ఇంటి అల్పాహారం నుంచి ఆఫీస్ లంచ్‌బాక్స్ వరకూ బ్రెడ్ లేకుండా రోజు మొదలవడం లేదు. ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో చాలామంది వైట్ బ్రెడ్‌ను పక్కన పెట్టి బ్రౌన్ బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. “బ్రౌన్ అంటే హెల్తీ” అనే నమ్మకంతో షెల్ఫ్‌పై కనిపించిన గోధుమ రంగు బ్రెడ్‌ను నేరుగా బాస్కెట్‌లో వేసేస్తున్నారు. కానీ నిజంగా ఆ బ్రౌన్ బ్రెడ్ అంతా ఆరోగ్యకరమేనా అనే ప్రశ్న ఇప్పుడు వినియోగదారులను ఆలోచింపజేస్తోంది.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే, బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది నిజమే. కానీ అది 100 శాతం గోధుమలు లేదా హోల్ గ్రెయిన్స్‌తో చేసినప్పుడే. గోధుమలు, తృణధాన్యాలతో తయారయ్యే బ్రౌన్ బ్రెడ్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని మెల్లగా పెంచి, ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.

అయితే మార్కెట్‌లో కనిపించే ప్రతి బ్రౌన్ బ్రెడ్ నిజంగా గోధుమలతో తయారైనదే కాదు. కొన్ని బ్రెడ్‌లు కేవలం రంగు కోసం కారామెల్ లేదా ఇతర కలరింగ్ ఏజెంట్స్ కలిపి తయారు చేస్తారు. బయటకు చూడడానికి గోధుమ రంగులో ఉన్నా, లోపల మాత్రం అవి మైదా బ్రెడ్‌లాగే ఉంటాయి. ఇలాంటి నకిలీ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగం ఉండదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు ప్యాకెట్‌పై ఉండే లేబుల్‌ను తప్పకుండా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. “100% Whole Wheat”, “Whole Grain” వంటి పదాలు స్పష్టంగా ఉన్నాయా లేదా చూడాలి. మొదటి పదార్థంగా గోధుమలు లేదా హోల్ గ్రెయిన్స్ ఉన్నాయా అన్నదీ ముఖ్యమే. అలా కాకుండా మైదా ప్రధానంగా ఉంటే, అది వైట్ బ్రెడ్‌కు మరో రూపమే అవుతుంది.

వైట్ బ్రెడ్ ఎక్కువగా మైదాతో తయారవుతుంది. ప్రాసెసింగ్ సమయంలో ఫైబర్, పోషకాలు చాలా వరకు తొలగిపోతాయి. అందుకే వైట్ బ్రెడ్ తింటే త్వరగా ఆకలి వేయడం, జీర్ణ సమస్యలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనితో పోలిస్తే నిజమైన బ్రౌన్ బ్రెడ్ శరీరానికి మద్దతుగా నిలుస్తుంది. మొత్తానికి బ్రౌన్ రంగు చూసి మోసపోకూడదు. బ్రెడ్ నిజంగా ఆరోగ్యాన్ని అందించాలంటే అది ఎలా తయారైంది అన్నదే అసలు విషయం. సరైన ఎంపిక చేసుకుంటే బ్రౌన్ బ్రెడ్ మీ ఆహారంలో ఒక మంచి హెల్తీ భాగంగా మారుతుంది.