సంక్రాంతి పందాల్లో శాస్త్రం పనిచేస్తుందా.. కోడి పందాల వెనుక కుక్కుట శాస్త్రం రహస్యాలు..!

దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్‌లో పండుగ సందడి కోడి పందాలతో మరింత ఉత్సాహంగా మారింది. సంక్రాంతి అంటే పంటల పండుగతో పాటు గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే కోడి పందాలు కూడా గుర్తొస్తాయి. పోలీసులు నిషేధం విధిస్తున్నా, పందెం రాయుళ్లు మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ పందాలను ప్రత్యక్షంగా చూడడానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారే స్థాయిలో పందాలు సాగుతున్నాయని సమాచారం.

అయితే ఈ కోడి పందాల్లో కేవలం ధైర్యం లేదా డబ్బు మాత్రమే కాదు, శాస్త్రం కూడా ఉందని నమ్మే వారు చాలామందే ఉన్నారు. ఈ నమ్మకానికే ‘కుక్కుట శాస్త్రం’ అనే పేరు ఉంది. మనుషులు జ్యోతిష్యం, వాస్తును ఎలా నమ్ముతారో.. కోడి పందాల ప్రపంచంలో కుక్కుట శాస్త్రం అలాంటి స్థానం దక్కించుకుందని పందెం రాయుళ్లు చెబుతుంటారు. ఈ శాస్త్రాన్ని అనుసరించి కోళ్లను ఎంపిక చేసి, సరైన రోజు, సరైన దిశ నుంచి బరిలో వదిలితే గెలుపు ఖాయమని వారి విశ్వాసం.

కుక్కుట శాస్త్రం ప్రకారం పందెం కోళ్లను ఈకల రంగుల ఆధారంగా వర్గీకరిస్తారు. కాకి అనే కోడి నల్లని ఈకలతో ఉండగా, డేగ ఎర్రటి ఈకలను కలిగి ఉంటుంది. నెమలి పసుపు ఈకలతో కనిపిస్తే, సేతు తెల్లని రంగుతో మెడపై నలుపు–తెలుపు మిశ్రమ ఈకలు ఉంటాయి. పింగళ గోధుమ రంగులో ఉండే కోడిగా గుర్తింపు పొందింది. ఈ రంగులు కేవలం గుర్తింపుకోసమే కాకుండా, వారాలు మరియు దిశలతో అనుసంధానమై ఉంటాయని నమ్మకం.

పందెం రాయుళ్ల విశ్వాసాల ప్రకారం ఆదివారం, మంగళవారం రోజుల్లో కాకిపై డేగను వదిలితే విజయం సాధిస్తుందంటారు. సోమవారం, శనివారం రోజుల్లో మాత్రం డేగపై కాకి గెలుస్తుందని చెబుతారు. బుధవారం, గురువారాల్లో కాకిపై పచ్చకాకిని వదలడం శుభమని నమ్ముతారు. అంతేకాదు, కోళ్లను బరిలో వదిలే దిశ కూడా కీలకమని భావిస్తారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర దిశల నుంచి ఆయా రోజుల్లో కోళ్లను వదలితే విజయం తమదేనని పందెం రాయుళ్లు విశ్వసిస్తుంటారు.

ఈ నమ్మకాలన్నీ శాస్త్రీయంగా రుజువుకాకపోయినా, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం, అనుభవాలే కుక్కుట శాస్త్రానికి బలం అని స్థానికులు అంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు కేవలం ఆటగా కాకుండా, గ్రామీణ సంస్కృతి, నమ్మకాల సమ్మేళనంగా కొనసాగుతుండటం విశేషం. ఒకవైపు నిషేధాలు, మరోవైపు సంప్రదాయం మధ్య ఈ పందాలు ప్రతి ఏడాది సంక్రాంతి వేళ చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి.