రెండేళ్ల తర్వాత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ రంగంలో మళ్లీ యాక్టివ్ కావడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని పెంచింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తాజా మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ దుమారం రేపాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య తాగునీటి అంశం, గతంలో జరిగిన ఒప్పందాలపై కేసీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా విమర్శించారు. విశాఖలో జరిగిన ఎంవోయూలను ఉద్దేశించి స్టార్ హోటళ్ల వంటవాళ్లు, సిబ్బంది సంతకాలు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవన్నీ బోగస్ ఒప్పందాలేనంటూ చంద్రబాబుపై సెటైర్లు వేయడంతో రెండు రాష్ట్రాల రాజకీయ నేతలు రంగంలోకి దిగారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏపీ నుంచి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు చేస్తూ రాజకీయ దాడిని మరింత పెంచారు. తాజాగా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ముఖం చూపించలేక రెండేళ్లుగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని, ఇప్పుడు అకస్మాత్తుగా బయటకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
అంతటితో ఆగని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కేసీఆర్ ఏ బ్రాండ్ తాగి బయటకు వచ్చారో అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు కూడా ఓడిపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్, బీఆర్ఎస్‌ను ప్రజలు ఇప్పటికే అసమర్థులుగా తీర్పు ఇచ్చారని, అందుకే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయని అన్నారు. తమ నాయకుడి జోలికి మళ్లీ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ–ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. కేసీఆర్ రీ–ఎంట్రీతో మొదలైన రాజకీయ వేడి, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
