Jupally Krishna Rao: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ధీటుగా బదులిచ్చారు. కేటీఆర్ ఒక అవకాశవాద నాయకుడని, ఆయన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని జూపల్లి మండిపడ్డారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. “అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజలను వంచించిన రాహుల్ గాంధీని నడిబజార్‌లో ఉరితీయాలి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వెనకేసుకొచ్చారు. రాహుల్ గాంధీ అత్యంత నిజాయితీ గల నాయకుడని, ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. అలాంటి నాయకుడిని ఉరితీయాలనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

ఇదే సందర్భంలో కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను జూపల్లి గుర్తు చేశారు. “తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ మాట తప్పారు. మరి ఆ మాట తప్పినందుకు కేసీఆర్‌కు కూడా ఇదే ఉరిశిక్ష సూత్రం వర్తించదా?” అని జూపల్లి నిలదీశారు.
ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన భూమిని వినియోగించకపోవడంపై కలెక్టర్ నోటీసులు ఇవ్వడాన్ని జూపల్లి సమర్థించారు. నిబంధనల ప్రకారం భూమిని వినియోగించని పక్షంలో వివరణ కోరడం కలెక్టర్ బాధ్యత అని, అందుకు ఆ అధికారిని అభినందించాలని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. రైతు హామీల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

