భారతీయ సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగకు నువ్వులు విడదీయరాని అనుబంధంగా నిలుస్తాయి. ఈ పండుగ రాగానే ప్రతి ఇంట్లో నువ్వుల లడ్డూలు, నువ్వుల దానం, నువ్వులతో పూజలు సహజంగా మారిపోతాయి. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు.. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక విశ్వాసాలు, బలమైన శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
మకర సంక్రాంతి అనేది సూర్యుడు తన ప్రయాణంలో మకర రాశిలోకి ప్రవేశించే మహత్తర ఘట్టం. పురాణాల ప్రకారం మకర రాశి శని దేవునికి సంబంధించినది. తండ్రి సూర్యుడు, కుమారుడు శని మధ్య ఉన్న విభేదాల నేపథ్యంతో ఈ రోజు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. శని దేవుడు నివసించే ప్రాంతం దహనమైపోయిన సమయంలో, అక్కడ మిగిలిన ఏకైక పదార్థం నల్ల నువ్వులేనని పురాణ కథనాలు వివరిస్తాయి. అదే నువ్వులతో శని దేవుడు తన తండ్రికి స్వాగతం పలికాడని విశ్వాసం.
కుమారుడి భక్తికి కరిగిపోయిన సూర్యుడు, మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో తనను పూజించే వారిపై శని ప్రభావం తగ్గుతుందని, వారికి శుభఫలితాలు కలుగుతాయని వరం ఇచ్చాడని చెబుతారు. అప్పటి నుంచి సంక్రాంతి నాడు నువ్వులకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. నువ్వుల దానం చేయడం, నువ్వులతో స్నానం చేయడం, నువ్వుల లడ్డూలు తినడం శుభప్రదంగా భావిస్తున్నారు.
ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య పరంగా కూడా నువ్వులు, బెల్లం సంక్రాంతి కాలానికి అత్యంత అనుకూలమైన ఆహారం. చలికాలం మధ్యలో వచ్చే ఈ పండుగ సమయంలో శరీరానికి వేడి అవసరం పెరుగుతుంది. నువ్వుల్లో ఉండే సహజ నూనెలు, బెల్లంలో ఉండే ఐరన్, మినరల్స్ కలసి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, అలసటను దూరం చేయడంలో నువ్వుల లడ్డూలు కీలక పాత్ర పోషిస్తాయి.
శాస్త్రాల ప్రకారం శని దేవునికి నువ్వులు అత్యంత ప్రీతికరమైనవి. అందుకే సంక్రాంతి రోజున నువ్వులను దానం చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని, నువ్వుల లడ్డూలు తినడం వల్ల సూర్యుడి తేజస్సు, శని అనుగ్రహం రెండూ లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. అందుకే సంక్రాంతి నాడు మనం ఆస్వాదించే నువ్వుల లడ్డూ కేవలం ఒక తీపి వంటకం కాదు. అది ఆరోగ్యానికి రక్షణ కవచం, తరతరాలుగా వస్తున్న భారతీయ జ్ఞాన సంపదకు ప్రతీక, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతిబింబంగా నిలుస్తోంది.
