రచన- దర్శకత్వం : మారి
తారాగణం : నవీన్ పోలిశెట్టి, మీనాక్షీ చౌదరి, రావు రమేష్, చంమాక్ చంద్ర, మాస్టర్ రేవంత్, మహేష్ తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్,
ఛాయాగ్రహణం : యువరాజ్,
కూర్పు : వంశీ అట్లూరి
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు : నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల : జనవరి 14, 2026
Anaganaga Oka Raju Movie Review: కామెడీలతో బాక్సాఫీని పోషిస్తూ వస్తున్న నవీన్ పొలిశెట్టి ఈ సంక్రాంతి మరో తన బ్రాండ్ కామెడీతో ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చాడు. దీనికి దర్శకుడు మారి. హీరోయిన్ మీనాక్షీ చౌదరి. ఈ సారి వరసగా సంక్రాంతి సినిమాలు ఓకే ధోరణిలో వస్తున్నాయి. ఈ ధోరణి ఎంతవరకూ ఆరోగ్యకరం, వీటిని చూసి ఇదే ధోరణి కొనసాగుతుందా, పూర్వం వీటికి కొంచెం భిన్నంగా నడిచిన ట్రెండ్ ఏమిటి? ఇంతకీ నవీన్ మూవీ ఓకేనా, కాదా? ఈ విషయాలు రివ్యూలో తెలుసుకుందాం…

కథేమిటి?
రాజు (నవీన్ పోలిశెట్టి) గౌరవపురం జమీందారు మనవడు. జమీందారు వారసుడని గొప్ప పేరేగానీ ఆస్తులేమీ మిగలకపోవడంతో ఆర్ధిక కష్టాలు పడుతూంటాడు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు గంటాడు. ఇలా చారులత (మీనాక్షీ చౌదరి) అనే అమ్మాయిని చూసి ఈమెని పెళ్లి చేసుకుంటే కష్టాలు తీరతాయని ప్ర్మించడం మొదలెడతాడు. అయితే ఆమెని పెళ్లి చేసుకున్నాక నిజంగానే అనుకున్నట్టు జీవితం మారిపోయిందా? మరి రాజకీయాలోఅడుగుపెట్టే అవసరం ఎందుకొచ్చింది? ఏమిటసలు రాజు భవిష్యత్తు? నిజంగా తను పెళ్లి చేసుకున్న చారులత డబ్బున్న అమ్మాయేనా? ఇలా ఇరకాటంలోపడ్డ రాజు ఎలా అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు? కలలుగన్న సంపన్న జీవితాన్ని అందుకున్నాడు? ఇదీ మిగతా కథ.
ఎలా వుంది కథ?
ఈ సంక్రాంతికి విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాగే ప్రస్తుత సినిమాలో కూడా కథ అనేది లేదు. ఇదేదో కొత్త ట్రెండ్ కి నాంది పలుకుతున్నట్టుగా వుంది. వీటిని చూసి కథ లేకుండా కేవలం కామెడీతో తీసే సినిమాలు వచ్చిపడతాయేమో? అయితే కామెడీతో అయినా కూర్చోబెట్టాలంటే చాలా కష్టపడాల్సి వుంటుంది. ఇక్కడే చేతులెత్తేసి వదిలేస్తున్నారు. ప్రస్తుత నవీన్ పోలిశెట్టి మూవీ మాత్రం కేవలం గత రెండు అతను నటించిన కామెడీ సినిమాల ఒరవడినే పట్టుకుని మరోసారి ఒన్ మాన్ షోగా చేసే ప్రయత్నం చేశారు. నవీన్ కామెడీలో ది బెస్ట్ అనేది ప్రూవ్ అయ్యాక, ఇక కథతో పనేమిటి? జోకులతో అతను నవ్విస్తూ పొతే చాలు అదే బాక్సాఫీసుకి పనికొచ్చే కంటెంట్ అవుతుందన్న కొత్త ఫార్ములాని ప్రేక్షకుల మీద ప్రయోగిస్తున్నారు.

ఈ సినిమాలో నవీన్ కామెడీ సీన్లు –సింగిల్ లైన్ పంచ్ లు ఫస్టాఫ్ వరకూ మ్యాజిక్ చేశాయనడంలో సందేహం లేదు. డబ్బులేని జమీందారు వారసుడిగా తన కస్టాలు తనకుండగా, సాయం కోసం తన దగ్గరికొచ్చే జనల కష్టాలు వినే పాత్లతో కథా ప్రారంభం రొటీన్ గానే వుంటుంది. ఇక డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలన్న ప్రణాళికతో అతను చేసే ప్రయత్నాలతో సీన్లు కాస్త వేగం పుంజుకుంటాయి. హీరోయిన్ మీనాక్షి కోదరితో ఆపరేషన్ చారులత మొదలయ్యాక మంచి ఊపు వస్తుంది. చారులత ప్రేమనిపొండడం కోసం ఫ్రెండ్స్ తొ చేసే కామెడీలు నెక్స్ట్ లెవల్ కెళ్తాయి. ఇక ఇంటర్వెల్లో చిన్న మలుపు. ఇది సాధారణంగా వుంటుంది.
సెకండాఫ్ లోనే సమస్యలు మొదలవుతాయి. సెకండాఫ్ లో పూర్తిగా కథ మారిపోయి ఎన్నికల వాతావరణం ముందుకొస్తుంది. ఈ ఎన్నికల్లో గెలవడానికి మరింకో ప్లాన్ వేస్తాడు. కానీ ఇక నవ్వించే విషయం లేక ఒన్ మాన్ షో కాస్తా ప్రాబ్లంలో పడుతుంది. ఎలాగో క్లయిమాక్స్ కి లాక్కొచ్చి ఎమోషనల్ సీనుతో, భార్య భర్తల మధ్య సెంటిమెంటల్ డైలాగులతో కొలిక్కి వస్తుంది.

గతంలో రొమాంటిక్ కామెడీల సీజన్ నడుస్తున్నప్పుడు లైటర్ వీన్ సినిమాలు అంటూ వచ్చేవి. వీటిలో కథ వుండేది. కాకపోతే లైట్ గా వుండేది. కామెడీ ఆధారంగా ఆ లైటర్ వీన్ కథలు నడిచేవి. ఇప్పుడు కథే లేకుండా కామెడీలు వస్తున్న కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఇదే ట్రెండ్ గా స్థిరపడుతుందేమో చూడాలి.
ఎవరెలా చేశారు?
ముందుగా చెప్పినట్టు ఇది నవీన్ పొలిశెట్టి ఒన్ మాన్ షో. ప్రతీ సీనులో కనపడుతూ నాన్ స్టాప్ డైలాగులతో నవ్విస్తూ పోతూంటాడు. పాత్రలో ఈ ఒక్క కోణం తప్ప వేరే భావోద్వేగాల ప్రదర్శన లేదు. మరొకటేమిటంటే డైలాగ్ వ్రైతర్ తనే!

హీరోయిన్ మీనాక్షీ చౌదరికి ఈ నవీన్ నాన్ స్టాప్ ఒన్ మాన్ షోలో సరైన స్థానం లేదు. ఫస్టాఫ్ లో అంతంత మాత్రం పాత్రతో నెట్టుకొచ్చింది. సెకండాఫ్ లో ఎక్కువ సేపు కనపడుతుంది. కనపడి ఏం చేస్తుందన్నది తెరపైనే చూడాలి. ఆమె తండ్రిగా రావు రమేష్ ది చిన్న పాత్రే. చంమాక్ చంద్ర, మహేష్, మాస్టర్ రేవంత్ లవి కామెడీలతో బాగా నవ్వించే పాత్రలు.
సాంకేతికాల సంగతి?
మిక్కీ జే మేయర్ సంగీతంలో రెండు పాటలు కమర్షియల్ గా బావున్నాయి. రాజుగారి పెళ్లిరో, భీమవరం బల్మా పాటలు రెండూ చిత్రీకరణ సహా బావున్నాయి. యువరాజ్ చాయాగ్రహణం, ఇతర నిర్మాణ విలువలూ బ్రహ్మాండంగా వున్నాయి.
సాంకేతికంగా ఓకే, సరుకు మాత్రం తక్కువే. కాస్త కథా, పాత్రచిత్రణల మీదా దృష్టి పెట్టి వుంటే, ఈ ఒన్ మాన్ షో- ఒన్ టైం వాచ్ అన్పించుకోకుండా రిపీట్ ఆడియెన్స్ ని కలిగి వుండేది. కానీ ఈ సంక్రాంతికి సరుకులేని కామెడీలే వస్తున్నాయి ఏం చేస్తాం?
రేటింగ్ : 2.5 / 5

