ఇంట్లో గోడకు వేలాడే గడియారం అంటే కేవలం సమయం తెలుసుకునే సాధనమే అనుకుంటే అది అర్ధసత్యమే. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గడియారం పెట్టే దిక్కు, అది ఉన్న స్థానం మన జీవన గమనాన్నే ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన దిశలో గడియారం ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి, అదృష్టం కలిసి వస్తుందని.. అదే తప్పు చోటుంటే అనుకోని అడ్డంకులు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
వాస్తు నిపుణుల సూచనల ప్రకారం ఇంట్లో గోడ గడియారం పెట్టడానికి ఉత్తరం లేదా తూర్పు దిక్కులు అత్యంత శుభకరమైనవిగా భావిస్తారు. తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించే దిశ కావడంతో, అక్కడ గడియారం ఉంటే ఇంట్లో ఉత్సాహం పెరిగి కొత్త పనులకు మంచి ఆరంభం కలుగుతుందని చెబుతారు. ఇది అభివృద్ధికి సంకేతంగా భావించబడుతుంది. అలాగే ఉత్తర దిక్కు ధనాధిపతి కుబేరునికి సంబంధించినదిగా వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ దిశలో గడియారం ఉంటే ఆర్థిక స్థిరత్వం, ఆదాయ వృద్ధి, కొత్త అవకాశాలు ఇంటివైపు ఆకర్షితమవుతాయని నమ్మకం.
అయితే దక్షిణ దిక్కులో గడియారం పెట్టడం మాత్రం వాస్తు ప్రకారం శుభం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దక్షిణం యముడికి సంబంధించిన దిశగా భావించబడుతుంది. ఈ గోడపై గడియారం ఉంటే కాలం మనకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా నడుస్తుందనే భావన ఉంది. దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడం, పనుల్లో ఆలస్యం, వ్యాపార నష్టాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
దిక్కులతో పాటు గడియారం అమర్చే స్థానం కూడా చాలా ముఖ్యం. ప్రధాన ద్వారం పైన లేదా గది గుమ్మాల పైన గడియారాన్ని వేలాడదీయకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల ఆ ద్వారం గుండా వెళ్లే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అలాగే బెడ్‌రూమ్‌లో మంచం తలవైపు గోడపై గడియారం ఉండటం కూడా మంచిది కాదని, టిక్-టిక్ శబ్దం, ఎలక్ట్రో మాగ్నెటిక్ ప్రభావాల వల్ల నిద్రకు భంగం కలిగి మనసు అస్థిరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక గడియారం డిజైన్ విషయంలోనూ జాగ్రత్తలు అవసరమే. పదునైన అంచులు, వింత ఆకారాలు ఉన్న గడియారాలకన్నా గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఉండే గడియారాలు వాస్తు పరంగా శ్రేయస్కరమని చెబుతున్నారు. ముఖ్యంగా లోలకం ఉన్న గడియారాలు ఇంట్లో శక్తి ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచి, జీవనశైలిలో ఒక రిథమ్‌ను తీసుకువస్తాయని వాస్తు నిపుణుల అభిప్రాయం.
రంగుల ఎంపికలోనూ ముదురు రంగులకంటే తెలుపు, క్రీమ్, లైట్ బ్లూ వంటి లేత రంగులు ప్రశాంతతను పెంచుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న గడియారం ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. ఆగిపోయిన గడియారం అంటే అభివృద్ధి ఆగిపోయినట్టేనని వాస్తు శాస్త్రం భావిస్తుంది. పగిలిన అద్దాలు, పని చేయని గడియారాలను వెంటనే తొలగించాలి. వీలైతే చెక్కతో చేసిన గడియారాలను వాడటం మరింత శుభప్రదమని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న మార్పే అయినా.. సరైన దిశలో పెట్టిన ఒక గడియారం జీవనంలో పెద్ద మార్పుకు కారణమవుతుందనే నమ్మకం వాస్తు శాస్త్రంలో ఉంది. అందుకే ఈరోజే మీ ఇంట్లో గడియారం ఏ గోడపై ఉందో ఒకసారి గమనించండి. తప్పు దిశలో ఉంటే మార్చేయడం వల్ల అదృష్టం మీవైపు తిరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
