ఫిబ్రవరిలో ఎలక్షన్.. జనవరిలో నోటిఫికేషన్..? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్..!

పంచాయతీ ఎన్నికల ఫలితాల ఉత్సాహంలో ఉన్న తెలంగాణ రాజకీయాలు మరో కీలక దశకు చేరుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే జోరుతో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి రెండో వారం లోపే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపే ఎన్నికలు ముగించాలన్న ఆలోచనతో జనవరి మూడో వారానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సీఎం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా అంతర్గతంగా సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.

తెలంగాణలో ప్రస్తుతం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు గడువు ఇప్పటికే ముగిసింది. అప్పటి నుంచి అవన్నీ ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇదే సమయంలో తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బిహార్‌లో ఈ రివిజన్ ద్వారా అక్రమంగా నమోదు అయిన లక్షలాది ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడులోనూ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా అక్రమ నివాసితుల ఓట్లను గుర్తించి తొలగించే పనిలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ అంశం రాజకీయంగా మరింత వేడి పెంచుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని వర్గాల ఓట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల్లో పెరుగుతోంది. ఎన్నికల జాబితా పూర్తిగా శుద్ధి కావాలన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ, ఓటర్ల జాబితా ప్రక్షాళనతో పాటు ఎన్నికల నిర్వహణపై తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఈ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరీక్షగా మారనున్నాయి.