Nari Nari Naduma Murari Movie Review: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ!

రచన- దర్శకత్వం : రాం అబ్బరాజు
తారాగణం : సంయుక్త, సాక్షీ వైద్య, నరేష్, సంపత్ రాజ్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్, ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్, యువరాజ్
బ్యానర్ : ఏకే ఎంటర్టయిన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్ నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు : అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
విడుదల : జనవరి 14, 2026

Nari Nari Naduma Murari Movie Review: గత ఆరేళ్లుగా హిట్స్ లేకుండా స్ట్రగుల్ చేస్తున్న హీరో శర్వానంద్ ఈ సంక్రాతికి మరో ప్రయత్నం చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 2023లో శ్రీ విష్ణు నటించిన ‘సామజవరగమన’ తో దర్శకుడు రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యాడు. దీని తర్వాత శర్వానంద్‌తో కలిసి ‘నారి నారి నడుమ మురారి’ మరో రోమాంటిక్ కామెడీని ప్రయత్నించాడు. శర్వానంద్ కి జోడీగా హీరోయిన్లు సంయుక్తా మీనన్, సాక్షీ వైద్యలని తీసుకున్నాడు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర దీన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్‌లతో ఉత్సుకత రేపిన తర్వాత సినిమా ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఈ సినిమాలో ఎలాటి విషయముంది? అదెంత వరకూ ఆకట్టుకోగలదు ప్రేక్షకుల్ని? పండగ పోటీ సినిమాల్లో దీని స్థానమెక్కడ? శర్వానంద్ కి ఈ సారైనా విజయం వరించిందా? ఈ విషయాలు తెలుసుకుందాం…

కథేమిటి?
గౌతం (శర్వానంద్) నిత్య (సాక్షీ వైద్య) ని ప్రేమిస్తూంటాడు. తను బీటెక్ చేసి ఆర్కిటెక్చర్ గా పని చేస్తూంటాడు. ఇతడి తండ్రి కార్తీక్ (నరేష్). నిత్య తండ్రి రామలింగం (సంపత్ రాజ్). గౌతం తండ్రి కార్తీక్ గౌతం- నిత్యల పెళ్ళికి ఒప్పుకున్నా, నిత్య తండ్రి రామలింగం ఒప్పుకోడు. తర్వాత ఒక షరతు పెడతాడు- రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకోవాలని. గౌతం అయిష్టంగానే ఒప్పుకుని రిజిస్ట్రారాఫీసులో పెళ్ళికి దరఖాస్తు చేసుకుంటాడు. ఇంతలో అతడికి దియా (సంయుక్త) తో సమస్య వస్తుంది. గతంలో గౌతం ప్రేమించిన దియా ఎవరు? ఆమె ఎలా సమస్య అయింది? దీంతో నిత్య- గౌతంల పెళ్లి ఏమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ?
ఈ సంక్రాంతి సినిమాల్లో వైవిధ్యం లేకుండా పోయింది. ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న కథలతో రెండు సినిమాలు విడుదలైతే (భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారీ), హీరోయిన్ తో పెళ్ళయి ఇబ్బంది పడే హీరో కథలతో మరో రెండు సినిమాలు (మన శంకర వర ప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు) విడుదలయ్యాయి. వీటన్నిటికీ కామెడీ ఆధారం కావడం ఇంకో రొటీన్. ఇలా పండగ పూట సినిమాల కెళ్తే సినిమా సినిమాకి వైవిధ్యం లేకుండా అవే కథలతో చూడాల్సి వస్తోంది ప్రేక్షకులకి. ఈ సినిమాలు సంక్రాతిని టార్గెట్ గా చేసుకుని, ఫ్యామిలీ కథలతో వుంటే బావుంటుందని దర్శకులు చేసిన ఆలోచన. అందుకే ఈసారి యాక్షన్ సినిమాలు లేవు- ఒక్క ‘రాజా సాబ్’ అనే హార్రర్ కామెడీ తప్ప!

‘నారీ నారీ నడుమ మురారీ’ కథేమిటో టైటిలే చెప్పేస్తోంది. చాలా పూర్వం 1990 లో ఇదే టైటిల్ తో బాలకృష్ణ- శోభన- నిరోషాలతో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న హీరో కథతో సూపర్ హిట్ మూవీ వచ్చింది. వీటన్నిటి ఫార్ములా ఒక్కటే- హీరోకి పెళ్ళయిన హీరోయిన్, ఇంకో ప్రేమించిన హీరోయిన్ వుంటారు. ఇదే పంథాలో ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా చేశాడు.

అయితే సంక్రాంతికి విడుదలైన మిగతా మూడు ఇలాటి మూవీస్ కథ లేకుంగా కామెడీ మీద ఆధారపడి వస్తే, ఈ మూవీ ఎమోషన్లు లేకుండా కామెడీ చేస్తూ వచ్చింది. ఈ దర్శకుడి గత మూవీ ‘సామజవరగమన’ లో వున్న స్థాయి కామెడీ గానీ, కథా బలంగానీ లేకపోవడం ఈ మూవీ ప్రధాన లోపం.

కారణమేమిటంటే, ఈ ఫార్ములా ప్రకారం హీరోతో సంఘర్షించడానికి ఉండాల్సిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు మిస్ అవడం. దీంతో హీరో నారీ నారీ మధ్య ఇరుక్కునే అవకాశం లేకపోవడం. ఎలాగంటే, రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళికోసం హీరో పోతే అతను గతంలో చేసుకున్నది రిజిస్టర్ మ్యారేజీయే కాబట్టి, ఈ పెళ్లి జరగని అడ్డు పడతాడు రిజిస్ట్రార్. పెళ్లి జరగాలంటే గతంలో పెళ్ళిచేసుకున్న భార్యనుంచి విడాకుల పత్రాలు తెమ్మంటాడు. కానీ ఇప్పుడు హీరో చూస్తే ఆమె వేరే పెళ్లి చేసుకుని వుంది. కాబట్టి ఆమెకి హీరోతో సంఘర్షించే అవకాశం లేకుండా పోయింది. అంటే హీరోకి సంఘర్షణగా, ప్రత్యర్ధిగా రిజిస్ట్రార్ మాత్రమే వున్నాడు. కాబట్టి ఒక హీరోయిన్ కథలోంచి అవుట్ అయిపోగా మిగిలిన ఒక హీరోయిన్ తో మిగిలాడు హీరో. ఈమెకి కూడా హీరో గతంలో పెళ్ళయిన విషయం తెలీదు కాబట్టి సంఘర్షణకి అవకాశమే లేకుండా పోయింది!

ఇలాటి సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) లేని కథ కాని కథతో పాత్రల మధ్య ఎమోషన్లు ఎలా పుఅడతాయి? కనుక ఫస్టాఫ్ ఏదో కామెడీతో టైం పాస్ చేస్తూ లాగించేసినా, సెకండాఫ్ లో విషయం లేదు. దీంతో కథలేని కథనాన్ని కామెడీ అతికించి నడపాలన్న ప్రయత్నం విఫలమైంది. బలవంతంగా రుద్దిన కామెడీతో హీరో సహా కమెడియన్లు సెకండాఫ్ ని నిలబెట్టలేక పోయారు. దీంతో ముగింపూ మొక్కుబడిగా వుంది. సంక్రాంతి సినిమాల పోటీలో శర్వానంద్ కి ఇంకో ఆశాభంగం తప్పలేదు.

ఎవరెలా చేశారు?
స్టూడెంట్ గా, మిడిలేజి వ్యక్తిగా శర్వానంద్ రెండు షేడ్స్ లో ఈజీగా నటించేశాసు. హీరోయిన్లతో రోమాన్స్ కి తను తక్కువేం కాదని నిరూపించేశాడు. కానీ సినిమాలో విషయం లేకపోవడంతో పాత్రతో ఆకట్టుకోవడానికి ఎమోషన్లు లేక చతికిలబడి పోయాడు. ఇక కామెడీ ఎంతబాగా చేసినా అది కథలోంచి పుట్టాలిగా? కథే లేనప్పుడు కామెడీ కోసం పడ్డ శ్రమ వృధా అయింది.

సంయుక్తా మీనన్ గ్లామర్, నటనా బావున్నై. అలాగే సాక్షీ వైద్య కూడా ఆకట్టుకుంటుంది కనిపించినప్పుడల్లా. కావాల్సింది సరైన పాత్ర చిత్రణలే ఇద్దరికీ. కమేడియన్లలో సత్య ఫాస్ట్ మార్కులు కొట్టేశాడు. సీనియర్ పాత్రల్లో నరేష్, సంపత్ రాజ్ లు ఫర్వాలేదు.

సాంకేతికాల సంగతి?
విశాల్ చంద్ర శేఖర్ సంగీతంలో పాటలు చాలా మైనస్. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బలహీనం. జ్ఞాన శేఖర్, యువరాజ్ ల కెమెరా వర్క్ ఎక్సెలెంట్. బ్యానర్ ప్రతిష్టకి తగ్గట్టుగా రిచ్ విజువల్స్ తో ప్లెజెంట్ గా వుంది. ఇతర నిర్మాణ విలువలూ పకడ్బందీగా వున్నాయి. ఉండాల్సింది దర్శకుడి ప్రతిభ. తన ఈ రెండో మూవీకే నిరాశపరుస్తూ పండుగ సినిమాని యావరేజ్ గా ప్రెజెంట్ చేసి సరిపుచ్చాడు.

రేటింగ్ : 2.5 / 5

దువ్వాడ దారెటు || Analyst Chillagattu Sreekanth EXPOSED Duvvada Srinivas Politics || Telugu Rajyam