చలికాలం మొదలవగానే శరీరం అలసటగా మారడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ఇలాంటి సమయంలో ఖరీదైన సప్లిమెంట్లు కాకుండా మనకు సులభంగా దొరికే ఒక సాధారణ ఆహారం అద్భుతమైన ఆరోగ్య రక్షణగా మారుతోంది. అదే వేరుశనగ. రుచికరంగా ఉండటమే కాకుండా, శీతాకాలంలో శరీరానికి కావాల్సిన శక్తి, వేడి, రక్షణ అన్నీ ఒకేసారి అందించే శక్తి వీటికి ఉంది.
వేరుశనగలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. అలాగే రక్తప్రసరణను మెరుగుపరిచే అమైనో ఆమ్లాలు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా హృదయ సంబంధిత సమస్యల ప్రమాదం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది.
శీతాకాలంలో తరచుగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వేరుశనగలు శరీరానికి సహజ రక్షణగా నిలుస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రెస్వెరాట్రాల్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పెంచుతాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
బరువు పెరుగుతుందేమోనన్న భయంతో చాలామంది వేరుశనగలకు దూరంగా ఉంటారు. కానీ నిజానికి మితంగా తీసుకుంటే ఇవి బరువు నియంత్రణకు సహకరిస్తాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు ఎక్కువసేపు నిండినట్టుగా ఉంచుతుంది. దీంతో అవసరానికి మించి తినే అలవాటు తగ్గుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఈ వేరుశనగలను తప్పు పద్ధతిలో తింటే ప్రయోజనాలకన్నా నష్టాలే ఎక్కువ. అతిగా తీసుకుంటే బరువు పెరగడం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసి, ఎక్కువ ఉప్పు, కారం కలిపి తింటే పోషక విలువలు తగ్గిపోతాయి. అధిక ఉప్పు రక్తపోటు సమస్యలకు దారి తీస్తుంది.
అందుకే నిపుణులు సూచించేది ఒక్కటే. రోజూ ఒక చిన్న గుప్పెడు వేరుశనగలు పచ్చిగా లేదా ఉడికించి తీసుకుంటే చాలు. సరైన మోతాదులో, సరైన విధానంలో తీసుకుంటే వేరుశనగలు శీతాకాల ఆహారంలో ఒక సంపూర్ణ ఆరోగ్య రక్షణగా మారతాయి.
