సంక్రాంతి సంబరాలు మొదలవ్వగానే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసరాలు కోడి పందాల హడావుడితో హోరెత్తిపోయాయి. ఏటా జరిగేదానికంటే ఈసారి పందెాలు మరింత భారీగా సాగుతుండగా, తాజాగా జరిగిన ఓ కోడి పందెం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్క పందెంలో ఏకంగా కోటి 53 లక్షల రూపాయలు చేతులు మారడంతో పందెం రాయుళ్లలో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
సంక్రాంతి పండుగలో భాగంగా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న కోడి పందాల్లో ఇవాళ రెండో రోజు ఈ భారీ పందెం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన ప్రభాకర్ సేతువ కోడి, రాజమండ్రి రమేశ్ డేగ కోడి మధ్య ఈ తలపోరు సాగింది. పందెం కాసే ముందు జాతకాలు, సమయం, ముహూర్తం అన్నీ పరిశీలించి మరీ పందెం రాయుళ్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. చివరకు రాజమండ్రి రమేశ్ డేగ కోడి విజయం సాధించడంతో అతడికి కోటి 53 లక్షల రూపాయల జాక్‌పాట్ దక్కింది.
ఈ పందెం చూసేందుకు స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పందెం బరిలో ఉత్కంఠ, ఉత్సాహం, ఉద్వేగం అన్నీ కలగలిసి పండుగ వాతావరణాన్ని మరింత ఉర్రూతలూగించాయి. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే అతిపెద్ద కోడి పందెమని స్థానికులు చెబుతున్నారు. ఈ విజయం నేపథ్యంలో రేపు మరిన్ని భారీ పందాలు జరిగే అవకాశం ఉందని పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.
సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకు సంప్రదాయం, సంబరం, కుటుంబ కలయిక. అదే సమయంలో కోడి పందాలు కూడా ఈ పండుగకు విడదీయరాని భాగంగా మారాయి. ఈసారి ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. వేల కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయని అంచనాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పందెం రాయుళ్లు, వీక్షకులు తరలివస్తుండటం గమనార్హం.
ఇక కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలను కొత్త తరహాలో నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ విధానంలో పోటీలు ఏర్పాటు చేసి, నేరుగా బెట్టింగ్‌లు లేకుండా విజేతలకు ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో చివరి రోజు విజేతలకు బైకులు, కార్లు వంటి విలువైన బహుమతులు అందించడంతో పందాలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. మొత్తం మీద ఈసారి సంక్రాంతి కోడి పందాలు రికార్డు స్థాయిలో సాగుతూ సంబరాలను మరో మెట్టు ఎక్కిస్తున్నాయి.
