ఇదేం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్.? నవ్విపోదురుగాక మనకేటి.?

Failure In Proper Vaccination
Failure In Proper Vaccination
 
మే 1వ తేదీ నుంచి 18-45 ఏళ్ళ మధ్య వయసువారికీ వ్యాక్సినేషన్.. అంటూ వ్యాక్సిన్ ఉత్సవాన్ని ప్రకటించేసింది కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో. ఈ ఏజ్ గ్రూప్ వ్యక్తులు ఎంతమందికి దేశంలో వ్యాక్సినేషన్ జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి.? అని లెక్కలు తీస్తే, పబ్లిసిటీ పీక్స్.. మేటర్ చాలా వీక్.. అనే విషయం తేటతెల్లమవుతుంది. నిజానికి, మొదటి డోస్ తీసుకున్నవారికి రెండో డోస్ వ్యాక్సిన్ అందడమే గగనంగా తయారైంది. రెండో డోస్ కాస్త ఆలస్యమైతే మంచిదే.. అని అధ్యయనాలు చెప్పడంతో సరిపోయిందిగానీ, లేదంటే.. ఆ రెండో డోస్ వ్యాక్సినేషన్ కారణంగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయేదే.
 
కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు ఇంకో ధర.. ప్రజలు స్వచ్ఛందంగా ప్రైవేటు ఆసుపుత్రుల్లో టీకాలు వేయించుకోవాలంటే వారికి మరో ధర.. అన్నప్పుడే, వ్యాక్సినేషన్ పక్రియలో డొల్లతనం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టమయిపోయింది. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రం మీద ప్రేమతో తక్కువ ధరకి ఇచ్చేస్తూ, రాష్ట్రాల మీద తక్కువ ప్రేమతో కొంచెం ఎక్కువ ధరకు విక్రయిస్తూ, ప్రజల ప్రాణాలంటే కనీస బాధ్యత లేకుండా ఎక్కువ ధరకు వ్యాక్సిన్లు విక్రయిస్తోంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దలు చూసీచూడనట్టు ఊరుకోవడాన్ని ఏమనుకోవాలి.? ఫెయిల్యూర్.. వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించడంలో అట్టర్ ఫెయిల్యూర్ ప్రదర్శించింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్. రోజుకి లక్ష డోసుల వ్యాక్సినేషన్ చేయగల సామర్థ్యం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి వుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు ఇదే సామర్థ్యం, ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగి వున్నాయి. కానీ, వ్యాక్సిన్లు మాత్రం లేవక్కడ. ఎందుకిలా.? ఈ వైఫల్యం ఎవరిది.? వ్యాక్సిన్లు ఎన్ని తయారవుతాయి.? ఎంతమందికి అవసరం.? అన్న లెక్కలు సరిగ్గా వేసుకోకుండానే వ్యాక్సినేషన్ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు మొదలెట్టిన కేంద్ర ప్రభుత్వం తీరు అస్సలేమాత్రం క్షమార్హం కాదు.