అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. టారిఫ్ విధానాల్లో మార్పులు చేస్తామన్న సంకేతాలతో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. భారత మార్కెట్లు ఊహించని నష్టాలను చవిచూశాయి. అందుకు తోడు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల సంపద ఒక్క రోజులోనే కనివినీ ఎరుగని విధంగా పడిపోయింది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం నాలుగురు భారత కుబేరులకు కలిపి దాదాపు 10.3 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
ముఖ్యంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే 3.6 బిలియన్ డాలర్లను కోల్పోయారు. ప్రస్తుతం ఆయన నికర సంపద విలువ 87.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి కూడా ఇదే పరిస్థితి. ఆయన సంపద 3 బిలియన్ల డాలర్లు క్షీణించి ప్రస్తుతం 57.3 బిలియన్లకు పరిమితమైంది. గతంలో ప్రపంచ అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచిన ఆయనకు ఇది ఓ గట్టి దెబ్బగా మారింది.
ఇక జిందాల్ గ్రూప్ తరఫున సావిత్రి జిందాల్ ఫ్యామిలీకి 2.2 బిలియన్ల డాలర్లు నష్టం వాటిల్లగా, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ సంపద 1.5 బిలియన్ల డాలర్లు తగ్గింది. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లలో చాలా మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. ట్రంప్ వ్యాఖ్యల వల్ల ఆర్థిక మాంద్యం భయం పెరిగిన నేపథ్యంలో పెట్టుబడిదారులు మార్కెట్ల నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు.
ఇప్పటికే బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్కరోజులో 2200 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా 700 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయించడంతో అన్ని సూచీలు పతనాన్ని నమోదు చేశాయి. దీనివల్ల కేవలం భారతదేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా కుబేరులు తమ సంపదలో కొంత భాగాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఎంతవరకు వెళ్తుందో, మరిన్ని రోజుల్లో మార్కెట్లు ఎలా స్పందిస్తాయో అనే అంశాలపై ఆర్థిక వేత్తలు దృష్టి పెట్టారు. అయితే ఈ పరిణామాలు చూస్తుంటే ప్రపంచ ఆర్థిక రంగం మరోసారి అస్థిరత దిశగా ప్రయాణించబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి.