జగన్‌ సర్కార్‌ పై కేంద్రం కనకవర్షం… మరో రూ.4,787 కోట్లు విడుదల!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై కేంద్రం కనకవర్షాన్ని కురిపిస్తోంది. నిన్న మొన్నటివరకూ జగన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ ఊకదంపుడు ఉపన్యాసం చేశారు బీజేపీ అగ్రనేతలు. అయితే ఈ విమర్శలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. జగన్ అలా చేస్తుంటే.. కేంద్రంలో ఉన్న తమరు ఏమి చేస్తున్నారంటూ బీజేపీ పెద్దలను సూటిగా ప్రశ్నించారు నెటిజన్లు. ఆ సంగతులు అలాఉంటే… తాజాగా జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

రెవెన్యూ లోటు బడ్జెట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి 10,461 కోట్ల రూపాయలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం 12,911 కోట్ల రూపాయలను సైతం యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. ఫలితంగా రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం పనులు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో గోదావరిలో వరదల కారణంగా కాఫర్‌ డ్యామ్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అదనంగా రూ. 2,000 కోట్ల సైతం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

అదే సమయంలో జగన్ సర్కార్‌ కు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ న్యూస్‌ చెప్పింది. అందులో భాగంగా… మరో రూ. 4,787 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను పంపిణీలో భాగంగా మూడవ విడత కింద 1,18,280 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 4,787 కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా స్పందించిన ఆర్థిక శాఖ… ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ లు, పథకాల కింద వ్యయం చేయడానికి వీలుగా జూన్ నెలకు సంబంధించిన మొత్తాన్ని అడ్వాన్స్ ఇన్‌ స్టాల్‌ మెంట్‌ కింద విడుదల చేసినట్లు వివరించింది.

ఈ వాటాల్లో భారీగా ఉత్తరప్రదేశ్ కు రూ.21,218 కోట్లు రాగా, అనంతరం బిహార్ కు రూ. 11,897 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ. 9,285 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ. 8,898 కోట్లు, తమిళనాడుకు రూ. 4,825 కోట్లు భారీ మొత్తంలో విడుదల చేసింది.